‘మహాలక్ష్మి’తో లాభాల్లోకి ఆర్టీసీ.. 200 కోట్ల ప్రయాణాలతో రూ.6 వేల కోట్లు ఆర్జించింది: డిప్యూటీ సీఎం భట్టి

‘మహాలక్ష్మి’తో లాభాల్లోకి ఆర్టీసీ.. 200 కోట్ల ప్రయాణాలతో రూ.6 వేల కోట్లు ఆర్జించింది: డిప్యూటీ సీఎం భట్టి
  • హైదరాబాద్‌‌కు త్వరలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు
  • రాష్ట్రంలో రూ. 20 వేల కోట్లతో రోడ్ల రిపేర్లు, అభివృద్ధి
  • ఐదేండ్లలో మహిళలకు లక్ష కోట్ల వడ్డీలేని రుణాలిస్తం 
  • ఇప్పటికే రూ. 25 వేల కోట్ల లోన్లు ఇచ్చినట్టు వెల్లడి
  • ఎంజీబీఎస్‌‌లో ఫ్రీ బస్సు జర్నీ సంబురాలు
  • ఆర్టీసీ పరిరక్షణ, ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యం: మంత్రి పొన్నం
  • త్వరలోనే గ్రామస్థాయి నుంచే డబుల్​ రోడ్లు: మంత్రి వెంకట్‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  మహాలక్ష్మి పథకం ద్వారా టీజీఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 200 కోట్ల ప్రయాణాలతో రూ. 6,680 కోట్లను ఆర్జించిందని చెప్పారు. కాంగ్రెస్‌‌ హయాంలో ఆర్టీసీ బలోపేతం అవుతున్నదని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా బుధవారం (జులై 23) హైదరాబాద్​లోని ఎంజీబీఎస్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.  

ఇందులో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం ప్రభాకర్,  కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ట్రాన్స్‌‌పోర్ట్​ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2023  డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని  ప్రారంభించామని చెప్పారు. ఆనాడు మునిగిపోతున్న పడవ ఎందుకు ఎక్కుతారని చాలా మంది అన్నారని, కానీ ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని.. ఇది మునిగిపోతున్న పడవ కాదు లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థ అని తమ ప్రభుత్వం నిరూపించిందని చెప్పారు. 200 కోట్ల మహిళా ప్రయాణికుల బస్సు చార్జీలు రూ.6, 680 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా మహిళల ఉచిత ప్రయాణ చార్జీలను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఇలా వచ్చిన ఆదాయంతో  కొత్త బస్సులను కొనుగోలు చేసే స్థాయికి ఆర్టీసీ ఎదిగిందని అన్నారు. 

2,400 కొత్త బస్సులు కొన్నం

తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  ఇప్పటివరకు 2,400 కొత్త బస్సులను కొనుగోలు చేసినట్టు భట్టి విక్రమార్క చెప్పారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 62 శాతం నుంచి 97 శాతానికి పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 45 లక్షల మంది ప్రయాణం చేస్తే, ఇప్పుడు 65 లక్షల మంది జర్నీ చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌‌ను కాలుష్యరహిత నగరంగా మార్చడానికి నగరంలో ఉన్న 2,800 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ కసరత్తు చేస్తున్నదని, ఇందుకు ఆర్డర్ కూడా ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో 11 శాతం ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని,   వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతామని చెప్పారు. 

ఆర్టీసీలో మహిళలకు కేవలం ఉచిత బస్సు ప్రయాణమే కాదు.. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను కూడా చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి  చేసేందుకు  ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు. ఐదేండ్లలో మహిళలకు లక్ష కోట్ల రూపాయలను వడ్డీలేని రుణాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. ఇప్పటికే రూ. 25 వేల కోట్ల లోన్లను అందించామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా  ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. 

ఆర్టీసీ నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చింది: పొన్నం

2023 డిసెంబర్​9న అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌‌రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించుకున్నామని ట్రాన్స్​పోర్ట్​ మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్నామని, ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్లు,కండక్టర్లకు అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.  

రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడికైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు.  గత బీఆర్ఎస్​ పాలనలో ఆర్టీసీ నిర్వీర్యం అయిందని, ఆర్టీసీ ఉంటుందా? అని అనుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్‌‌తో ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిందని చెప్పారు.  కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.  ఆర్టీసీ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యం, ఉద్యోగుల సంక్షేమం అనే నినాదంతో ఆర్టీసీ ముందుకు పోతున్నదని ఆయన వెల్లడించారు. 

కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తం: మంత్రి వెంకట్‌‌రెడ్డి

రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్న బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా  ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. మహిళలతో బస్సులు కొనుగోలు చేయించి,  వారిని యజమానులను చేయడంతో పాటు పెట్రోల్ బంకులు కూడా పెట్టించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి కొత్తగా డబుల్ రోడ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. 

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ  ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలతో ముందుకుపోతున్నదని చెప్పారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేసి, ఆ డబ్బులను ఆదా చేసుకున్న విద్యార్థినులు, మహిళలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వెంకట్‌‌రెడ్డి సన్మానించారు. మహాలక్ష్మి పథకం సక్సెస్​ కావడానికి ఆర్టీసీలో అత్యుత్తమ సేవలు అందించిన డ్రైవర్, కండక్టర్లను కూడా వారు సత్కరించారు.