బస్సు టికెట్లకు క్యూఆర్ కోడ్!

బస్సు టికెట్లకు క్యూఆర్ కోడ్!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుకరోనా నేపథ్యంలో బస్ టికెట్ల విధానంలో మార్పులు తీసుకురావాలని ఆర్టీసీ ఆలోచిస్తున్నది. ప్యాసింజర్ల నుంచి నేరుగా మనీ తీసుకోవడాన్ని తగ్గించి, క్యాష్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌ ట్రాన్జాక్షన్స్  పెంచేందుకు ప్లాన్  చేస్తున్నది. దీని వల్ల చిల్లర సమస్య కూడా తగ్గుతుందని భావిస్తున్నది. ఎక్కువ మొత్తంలో జనరల్ బస్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌లు అందుబాటులోకి తేవాలనుకుంటున్నది. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నది.

బస్సులు నడపడంపై నజర్‌‌‌‌‌‌‌‌

మార్చి 22 నుంచి రాష్ట్రంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం అత్యవసర సిబ్బంది, మెడికల్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ తరలింపు, కార్గో సర్వీసుల కోసం మాత్రమే కొన్ని బస్సులను నడుపుతున్నారు. రాష్ట్రంలోని 97 డిపోల్లో 10 వేలకు పైగా బస్సులు ఉన్నాయి. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ కంటే ముందు ఆర్టీసీ రోజుకు కోటి మందికి పైగా ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరవేసేది. సంస్థకు రోజుకు రూ.12 కోట్ల నుంచి 13 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే రాష్ట్రంలో ఈ నెల 15 తర్వాత గ్రీన్‌‌‌‌‌‌‌‌ జోన్లలో బస్సులు నడిపే అవకాశాలు ఉండటంతో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు.

ఎక్కువగా క్యాష్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌ ట్రాన్జాక్షన్లు

ప్రయాణ సమయంలో కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌ వ్యాప్తి చెందకుండా అమలు చేయాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ అధికారులు ప్లాన్​ రెడీ చేస్తున్నారు. బస్సు ఎక్కేముందే.. కండక్టర్‌‌‌‌‌‌‌‌ వద్ద టికెట్లు తీసుకునే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ప్రధాన బస్టాప్‌‌‌‌‌‌‌‌లలో టికెట్‌‌‌‌‌‌‌‌ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. స్టాప్‌‌‌‌‌‌‌‌ల వద్ద జనం గుమిగూడకుండా ప్రత్యేకంగా సిబ్బందిని  నియమించనున్నారు. టికెట్‌‌‌‌‌‌‌‌ విషయంలో క్యాష్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌  ట్రాన్జాక్షన్లను ఎక్కువగా ఉపయోగించాలని భావిస్తునారు. బస్సులు ఎప్పుడు నడిచినా టికెట్‌‌‌‌‌‌‌‌ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో చిల్లర సమస్య లేకుండా రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిగర్​గా రేట్లను సరిచేయనున్నారు. సిటీల్లో ఎక్కువ మొత్తంలో జనరల్ బస్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌లు అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు. దీన్ని ప్రోత్సహించడానికి అవసరమైతే మంత్లీ పాస్‌‌‌‌‌‌‌‌లకు కొద్దిమేర రాయితీలు కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.

క్యూఆర్‌‌‌‌‌‌‌‌  కోడ్‌‌‌‌‌‌‌‌ల ఉపయోగిస్తే ఎట్లుంటది?

కరోనా నేపథ్యంలో యూపీఐ క్యూఆర్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ ద్వారా టికెట్లు అమ్మితే ఎలా ఉంటుందని ఆర్టీసీ ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. గూగుల్‌‌‌‌‌‌‌‌ పే, అమెజాన్‌‌‌‌‌‌‌‌ పే, పేటీఎం, ఫోన్‌‌‌‌‌‌‌‌ పే, మొబీక్విక్‌‌‌‌‌‌‌‌, భీమ్‌‌‌‌‌‌‌‌ వంటి యాప్‌‌‌‌‌‌‌‌ల ద్వారా ట్రాన్జాక్షన్లపై స్టడీ చేస్తునారు.  ఒక వేళ ఇది ఓకే అనుకున్నా వెంటనే అమలు చేయబోమని, రెండు నుంచి మూడు నెలల టైం పట్టొచ్చని ఓ ఉన్నతాధికారి చెప్పారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేయాల్సి ఉంటుందని, దీనిపై కండక్టర్లకు కూడా ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లో  ఎక్కువ బస్సుల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌  టికెట్లు అందుబాటులోకి తెచ్చారు. అయితే మన దగ్గర ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ టికెట్ల జారీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు అంటున్నారు. అందరికీ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో టికెట్‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం రాదని, దీంతో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. గతంలో పూర్తిగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ టికెట్లతో ఏసీ వజ్ర బస్సులను అందుబాటులోకి తెచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని, ఆన్​లైన్​లో టికెట్లు బుక్​ చేసుకునేవారు లేక తీవ్ర నష్టాలు వచ్చాయని అధికారులు గుర్తుచేస్తున్నారు.

నడిచేవి 50 శాతం బస్సులే!

రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అనుమతించినా బస్సులును నడిపేందుకు అధికారులు రెడీ చేసిపెట్టారు. డిపోల్లో బస్సుల కండిషన్‌‌‌‌ను మెకానిక్స్  చెక్‌‌‌‌ చేస్తున్నారు. బస్సుల ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సరిగా ఉందో లేదో చూస్తున్నారు. అయితే బస్సులు ఎప్పుడు నడిపినా 50 శాతం మాత్రమే బయటకు తీస్తామని అధికారులు అంటున్నారు. బస్సులో 50 శాతం మందిని మాత్రమే ఎక్కించుకోవాలనే కండిషన్​ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో బస్సులను నడిపితే భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని, అందుకే సగం బస్సులను మాత్రమే నడపాలని అధికారులు భావిస్తున్నారు.