ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా మేం కొనసాగిస్తం

ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా మేం కొనసాగిస్తం

హైదరాబాద్‌, వెలుగు: సమ్మెను ఆర్టీసీ జేఏసీ విరమించినా తాము కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ–1 కన్వీనర్, టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌ స్పష్టం చేశారు. సమ్మెలో 29 మంది కార్మికులు మరణించారని, వారి త్యాగాలు వృథా కావాల్సిందేనా అని ప్రశ్నించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు మధ్యలోనే విలీనం డిమాండ్​ను వదులుకోవడం, సమస్యలను గాలికొదిలేసి సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించడం సరికాదని అన్నారు. సమ్మెపై గురువారం హైదరాబాద్‌లోని టీజేఎంయూ ఆఫీసులో జేఏసీ –1 నేతలు చర్చించారు. అనంతరం హనుమంతు ముదిరాజ్​ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోవడానికి జేఏసీ కన్వీనర్, గుర్తింపు యూనియన్‌ జనరల్ సెక్రటరీ అశ్వత్థామ రెడ్డి కారణమని ఆరోపించారు.

ఇటీవల పలు డిపోల పరిధిలో కార్మికులపై కేసులు నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ ప్రకటించడం అంటే కార్మికులను మోసం చేయడమేనని  మండిపడ్డారు. ఇలా సమ్మె విరమించాలనుకున్నప్పుడు సీఎం కేసీఆర్‌ లాస్ట్‌ ఛాన్స్‌ ఇచ్చినప్పుడే విరమిస్తే సరిపోయేదన్నారు. జేఏసీ నేతల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, కార్మికులను బలిపశువు చేశారని, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారని జేఏసీ 1 కన్వీనర్​ హనుమంతు ఆరోపించారు. ఆర్టీసీలో బడుగుబలహీన వర్గాలవారే ఉన్నారని, త్వరలోనే సీఎంను కలిసి సమస్యలను వివరిస్తామని చెప్పారు. సీఎం దయతలచి మంచి నిర్ణయం తీసుకోవాలని, ఆర్టీసీని రక్షించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఆర్టీసీ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.