నియంత పాలన అంతమైంది.. నార్మల్ కాల్స్ మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినం

నియంత పాలన అంతమైంది.. నార్మల్ కాల్స్ మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినం

హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రంలో నియంత పాలన అంతమైంది. ఒక పార్టీ గెలవడం, ఓడటం ఉద్యోగులకు పెద్ద ఫరక్ పడదు. రాష్ట్రంలో ఇపుడు వాట్సాప్ కాల్స్ మాట్లాడాల్సిన అవసరం లేదు.. నార్మల్ కాల్స్ స్వేచ్ఛగా మాట్లాడుకునే రోజులు వచ్చాయి” అని ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అన్నారు. రెవెన్యూ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి, టీజీవో వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాస్ తో కలిసి ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘2014లో ఫామ్ హౌస్ తీసుకపోయి ఉద్యోగుల విషయంలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు.

అవి నిజమని నమ్మినం, కానీ అంతా ఉత్తిదే చేసి మాపైనే కక్ష గట్టారు. ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డులు నాలుక గీసుకోనికి కూడా పనికిరాలేదు. అరచేతిలో వైకుంఠం చూపించడంలో కేసీఆర్, కేటీఆర్​ను మించినోళ్లు లేరు” అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి 921 మంది ఉద్యోగులే ఉన్నారని.. ఇతర రాష్ట్రాలలో లక్ష మందికి 1500 మంది ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. ఫస్ట్ తారీఖు రావాల్సిన జీతాలు నెలలో ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి తీసుకువచ్చారని విమర్శించారు. గతంలో తమకు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని.. ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నామని చెప్పారు.

తమ ఉద్యోగ సంఘ నాయకులు కొందరు వేల కోట్ల ఆస్తులు ఉన్నోళ్లు ఉండొచ్చునని.. అయితే అందరి పరిస్థితి అదే కాదన్నారు. ఇన్నాల్లు ఉన్న పాలకులు బదిలీల కోసం ఉద్యోగులు సరూర్ నగర్​లో బహిరంగ సభ పెట్టాల్సిన దుస్థితి రాష్ట్రంలో తీసుకువచ్చారని విమర్శించారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఖాసీం రజ్వి కంటే దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. కొందరు ఐఏఎస్​లు దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు లేకుండా తెలంగాణ వచ్చేది కాదన్నారు. సమస్యల పరిష్కారానికి, సంక్షేమం కోసం అన్ని డిపార్ట్​మెంట్లతో పాటు టీజీవో, టీఎన్​జీవో ఇతరత్రా సంఘాలన్ని కలిసి జేఏసీగా ఏర్పడాలని అన్నారు. ప్రశ్నించే తత్వాన్ని కొత్త ప్రభుత్వం స్వీకరించే విధానం ఉండాలన్నారు.

రాజకీయాలకు అతీతంగా పనిచేయాలె

బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్ మెంట్ ను నిర్వీర్యం చేసిందని రెవెన్యూ జేఏసీ చైర్మన్​ లచ్చిరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ ను గద్వాల్ కు బదిలీ చేశారని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు చేయాల్సిన సిబ్బంది లేని పరిస్థితి తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వం ఓడిపోవడానికి ధరణి కూడా ఒక కారణమన్నారు. కేసీఆర్ గతంలో రెవెన్యూతో పెట్టుకుంటే ఖతం అయితామని చెప్పారని.. అదే నిజమైంది. గతంలోలా కాకుండా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రాజకీయాలకతీతంగా పనిచేసుకుంటే ఉద్యోగ సంక్షేమం బాగుంటుందని తెలిపారు.