ఆర్టీసీ బిల్లుకు రెండ్రోజుల్లో ఆమోదం!

ఆర్టీసీ బిల్లుకు రెండ్రోజుల్లో ఆమోదం!
  • ప్రభుత్వమే బిల్లును పంపకుండా లేట్ చేసింది: జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి 
  • పీఆర్సీలు, ఇతర బకాయిల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీస్కెళ్లినం  
  • విలీనానికి ముందే సర్కారు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్  
  • గవర్నర్​ ఓకే చెప్పారని జేఏసీ నేతల వెల్లడి


హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లును రెండు రోజుల్లో ఆమోదిస్తానని గవర్నర్ తమిళిసై చెప్పారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. డ్రాఫ్ట్ బిల్లుపై గవర్నర్ చేసిన సిఫార్సులపై లా సెక్రటరీ ఒపీనియన్ రాజ్ భవన్​కు చేరిందని గవర్నర్ చెప్పారన్నారు. బిల్లును గవర్నర్​కు పంపడంలో ప్రభుత్వమే పది రోజులు ఆలస్యం చేసిందన్నారు. ఆర్టీసీ విలీనానికి ముందే ప్రభుత్వం కార్మికుల సమస్యలపై క్లారిటీ ఇవాలని కోరారు. జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్ హనుమంతు ముదిరాజ్, నరేందర్, ఇతర నేతలు మంగళవారం రాజ్ భవన్​లో గవర్నర్​ను కలిశారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 33 సమస్యలతో గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికులకు 2 పీఆర్సీలు, 2012 పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు రూ.750 కోట్లు,  సీసీఎస్ కు రూ.1,050 కోట్లు, పీఎఫ్ ట్రస్ట్ కు రూ. 1,235 కోట్లు, ఎస్బీటీ రూ.140 కోట్లు, ఎస్ఆర్బీఎస్ రూ.500 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిపై విలీనానికి ముందే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్ అయిన, వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకూ పీఆర్సీలు వర్తింప చేయాలన్నారు. కారుణ్య నియామకాల కోసం వెయిట్ చేస్తున్న 970 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. ఇంతకుముందు కారుణ్య నియామకాల కింద 160 మందిని తీసుకుని కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారని, వారిని వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. ఈ సమస్యలన్నింటిపైనా గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కారం కావని, బిల్లును ఆమోదించిన తర్వాత అన్ని యూనియన్లతో అధికారులు చర్చలు జరపాలన్నారు.  

ప్రగతి భవన్​ను ఎందుకు ముట్టడించలే? 

ఆర్టీసీ బిల్లుపై లా సెక్రటరీ ఒపీనియన్ వచ్చిన తర్వాత పది రోజుల పాటు బిల్లును గవర్నర్ కు పంపకుండా ప్రభుత్వం లేట్ చేసిందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. ప్రభుత్వం లేట్ చేసినా.. అధికార పార్టీ అనుబంధ సంఘం ప్రగతి భవన్ ను ఎందుకు ముట్టడించలేదని ప్రశ్నించారు. బిల్లు విషయంలో రాజ్ భవన్ ను ముట్టడించాలని కార్మికులకు లేకున్నా.. ప్రభుత్వ యూనియన్ నేతలే ముట్టడికి ప్రోత్సహించారని ఆరోపించారు. కొందరు గవర్నర్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేశారని, కానీ కార్మికులు మాత్రం గవర్నర్ కు వ్యతిరేకంగా లేరన్నారు. డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించేటప్పుడు సమయం తీసుకున్నామని, అన్నీ పరిశీలించి పది సిఫార్సులు చేస్తూ లా సెక్రటరీ ఒపీనియన్ కు బిల్లును పంపామని గవర్నర్ చెప్పారని జేఏసీ కన్వీనర్ హనుమంతు తెలిపారు. అన్ని అంశాలపై ప్రభుత్వంతో చర్చించి కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. విలీనం తర్వాత రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలని, ఆర్టీసీ అప్పులను తీర్చాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రంలో కోరామని తెలిపారు. ఆర్టీసీ విలీనం తర్వాత కార్మికులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోమని ఆయన హెచ్చరించారు.