ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్​ కన్ను: అశ్వత్థా మరెడ్డి

ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్​ కన్ను: అశ్వత్థా మరెడ్డి
  • మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తా అనలేదా?: అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్, వెలుగుఆర్టీసీ ఆస్తులపై సీఎం కేసీఆర్​ కన్నేశారని, వాటిని కాపాడుకునేందుకు ఎంతదాకైనా పోరాడుతామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ అశ్వత్థామరెడ్డి  అన్నారు. ‘‘రాష్ట్ర ఆర్టీసీకి రూ. 60వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. కార్మికుల రక్తం, చెమటతో అంత ఆస్తులైనయి. ఆ ఆస్తులపై కేసీఆర్​ కన్నేశాడు. ఒకే వ్యక్తికి  46 బంకులు ఇవ్వడం ఏంది?” అని నిలదీశారు. భయపడే ప్రసక్తే లేదని, గమ్యం చేరే పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సకల జనుల సమరభేరిని నిర్వహింంచారు. దీనికి అఖిలపక్ష నేతలు, వివిధ సంఘాలు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ వరంగల్‌‌ ఎంపీ పసునూరి దయాకర్‌‌ పేరుమీద 3 ఎకరాల 50 సెంట్లు తీసుకున్నారని, దయాకర్‌‌ దగ్గర కూడా అంత డబ్బు లేదని, అది కూడా బినామీలే తీసుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీకి ఇయ్యాల్సిన డబ్బులకు ప్రభుత్వం రూ. 500 కోట్లు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిందని, ఇందుకోసం నాలుగు కోట్ల కమీషన్‌‌ తీసుకుందని దుయ్యబట్టారు. ఇది కమీషన్‌‌ ఏజెన్సీ ప్రభుత్వమా? లేక ప్రజా సంక్షేమ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ఎన్ని డీజిల్‌‌ బంక్‌‌లకు రూ. 36 లక్షల బ్యాంక్‌‌ గ్యారంటీ ఇచ్చారో సిట్టింగ్‌‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌‌ చేశారు. బ్యాంక్ గ్యారంటీ ఎందుకు కడ్తలేరో చెప్పాలని, ఇందులో ఎవరి హస్తం ఉందో బయటపెట్టాలని అన్నారు. మేఘా కృష్ణా రెడ్డి, గోల్డ్‌‌ స్టోన్ ప్రసాద్‌‌, మైహోం రామేశ్వరరావు ఎలక్ట్రిక్‌‌ బస్సులను నడిపే పేరుతో ఆర్టీసీ ఆస్తులను సమకూర్చుకోవాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

అప్పట్లో కరీనంగర్​లో ఏం చెప్పినవ్​?

‘‘తెలంగాణ ఏర్పడితే ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కరీంనగర్​ సభలో  నువ్వు మాటిచ్చినవా లేదా? దీనిపై ఎవరిని చర్చకు పంపుతావో పంపు. నిరూపిస్తాం. నిరూపించకపోతే ముక్కు నేలకు రాసి డ్యూటీలో జాయిన్​ అవుతం” అని సీఎం కేసీఆర్​కు అశ్వత్థామరెడ్డి సవాల్​ విసిరారు. ‘‘2015 మే 13 నాడు ఏమన్నవ్​..? మనది ధనిక రాష్ట్రమని చెప్పలేదా?  నెక్ట్స్​ పే స్కేల్​ 2017లో ఇస్తా అని చెప్పలేదా? మరి ఏమైంది? 31 నెలల నుంచి పే స్కేల్​ ఆగిపోయింది ’’ అని సీఎంపై ఫైర్​ అయ్యారు. ‘‘విలీనం పేరు పెడుతవా.. ఏం పేరు పెడుతవో నీ ఇష్టం. నీకన్నా చిన్నోడైన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్​ చేసినట్లు చేయమంటున్నం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు” అని కేసీఆర్​ను డిమాండ్​ చేశారు. ‘‘ఆర్టీసీపై చర్చకు మా మహిళా కండక్టర్లను పంపుతం. వాళ్లు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు’’ అని అన్నారు. తనపై ఎన్నో ఆరోపణలు చేశారని, విజిలెన్స్‌‌ విచారణ జరిగి క్లీన్‌‌చీట్‌‌ కూడా వచ్చిందన్నారు. తనకు సెంట్‌‌ భూమి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చర్చకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కేసీఆర్‌‌.. నిమ్స్‌‌ రిపోర్ట్‌‌ బయటపెడతం: పొన్నాల

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌‌ ఏం దీక్షలు చేశారో అందరికీ తెలుసని, నిమ్స్ రిపోర్ట్ బయటపెడుతామని పీసీసీ మాజీ చీఫ్​ పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. ప్రజాస్వామ్యవాదులకు, నియంతృత్వవాదులకు మధ్య పోరాటం జరుగుతోందని, ఇందులో ప్రజాస్వామ్యవాదులే గెలుస్తారని చెప్పారు. కేసీఆర్​ రవాణా శాఖ మంత్రిగా, కార్మిక శాఖగా ఉనప్పుడు ఏమి చేశారో, ఆయనపై ఎన్ని కేసులు నమోదయ్యాయో అందరికీ తెలుసన్నారు. ప్రపంచ నియంతల్లో కేసీఆర్ మొదటి స్థానాన్ని  సంపాదించుకున్నారని దుయ్యబట్టారు.
ఆర్టీసీ ఉద్యమంలో చనిపోయిన రెండు కుటుంబాలకు  తన వంతు సాయంగా రూ. రెండు లక్షల ఇస్తానని పేర్కొన్నారు.

తలసాని, ఎర్రబెల్లి, గంగుల అడ్డమీది కూలీలు: ఎల్‌‌.రమణ

మంత్రులు తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, గంగుల కమలాకర్ అడ్డమీది కూలీలు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌‌.రమణ విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు, రైతులు కన్నెర్ర చేస్తే సీఎం కొట్టుకుపోతారని హెచ్చరించారు. కార్మికులపై కేసీఆర్​ కాలు దువ్వుతున్నారని, ఖబడ్దార్‌‌ చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఆర్టీసీ ఉద్యమంలో చనిపోయిన శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ కుటుంబాలకు లక్ష చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.

రాజ్యాంగ సంక్షోభం వైపు పాలన : కోదండరాం

సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు నెల రోజుల జీతం వదులుకున్నారని, వారి కోసం తెలంగాణ బంద్‌‌ను విజయవంతం చేయాలని టీజేఎస్​ చీఫ్​  కోదండరాం పిలుపునిచ్చారు. కోర్టు అడిగితేనే చేయకపోతే ఇక తాము అడిగితే ఏం చేస్తారని సర్కార్​పై మండిపడ్డారు. పాలనను రాజ్యాంగ సంక్షోభం వైపునకు నెడుతోందన్నారు. రాజ్యాంగ సంక్షోభం వస్తే పరిణామాలు వేరే లాగా ఉంటాయని హెచ్చరించారు. ఇది ఆర్టీసీ కార్మికుల ఒక్క సమస్య కాదని, తెలంగాణ ప్రజలందరిదని అన్నారు.

ఇది అందరి సమ్మె : మోహన్‌‌ రెడ్డి

బంద్​ను జయప్రదం చేయాలని బీజేపీ నేత మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది అందరి సమ్మె అని, ఆర్టీసీ కార్మికులకు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య మాట్లాడుతూ ప్రజా రథ చక్రాల కింద కేసీఆర్ నలిగి పోతారని హెచ్చరించారు. జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ ఇంత మంది చనిపోతుంటే కేసీఆర్‌‌కు కనీసం చీమ కుట్టినట్టు లేదా అని ధ్వజమెత్తారు. అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరూ బంద్‌‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి