నిరూపిస్తే సమ్మె ఆపేస్తం: కేసీఆర్ కు ఆర్టీసీ జేఏసీ సవాల్

నిరూపిస్తే సమ్మె ఆపేస్తం: కేసీఆర్ కు ఆర్టీసీ జేఏసీ సవాల్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మాయ చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడ్డారు. ఆయన చేసిన ప్రకటనలోని విషయాలను నిజమని నిరూపిస్తే తక్షణం సమ్మె ఆపేసి, విధుల్లో చేరుతామని మూడు సవాళ్లు విసిరారు.

  1. ఏ రాష్ట్రంలోనూ లేని జీతాలు తెలంగాణలో ఉన్నాయని సీఎం చెప్పారు. ఏపీలో ఆర్టీసీ జీతాలతో పోల్చి చూడండి. వాళ్లకన్నా ఎక్కువ ఉంటే సమ్మె ఆపేస్తం.  మా జీతాలు తక్కువ ఉంటే వాళ్లతో సమానంగా ఇస్తారా అని చాలెంజ్ చేస్తున్నాం.
  2. బిహార్ లో ఉందా? కర్ణాటకలో ఉందా? మహారాష్ట్రలో ఉందా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా అన్నది కాదు. మొన్నటి దాకా కలిసి ఉన్న ఏపీలో ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. గతంలోనే ఒప్పుకున్న డిమాండ్ ఇక్కడ కూడా అమలు చేయమంటున్నాం. దమ్ముంటే పక్క రాష్ట్రంతో కూర్చో. నువ్వు కూడా విలీనం చెయ్.
  3. అసిస్టెంట్ మేనేజర్ నుంచి కార్మికుడి వరకు యావరేజ్ జీతాలు రూ.50 వేలు ఉన్నాయని నిరూపించు. ఒక్క రూపాయి కూడా అడగం. ఎక్కడో కాదు.. అమర వీరుల స్థూపానికి దండ కూడా వేయనీయలే. అక్కడికే రండి. మొత్తం మా పే స్లిప్స్ తీసుకుని వచ్చి నిరూపించు. రూ.50 వేలు రాకుంటే పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ మూడింటిలో ఏ సవాల్ ను స్వీకరిస్తారో చెప్పాలని కేసీఆర్ ను జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. తమ సవాళ్లను స్వీకరించి నిరూపిస్తే సమ్మె ఆపేస్తామని చెప్పారు.