9న మిలియన్ మార్చ్ ..కేసీఆర్ మంచి తండ్రిలా చర్చలకు పిలవాల : అశ్వత్థామ

9న మిలియన్  మార్చ్ ..కేసీఆర్ మంచి తండ్రిలా చర్చలకు పిలవాల : అశ్వత్థామ

హైదరాబాద్, వెలుగు:

పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఈనెల 9న ట్యాంక్ బండ్ మీద నిరసన, సాముహిక దీక్షలు చేపడుతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. ఆర్టీసీలో ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా చొరబడే అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సంయుక్తంగా చేపట్టిన ‘ఆర్టీసీ కార్మికుల తల్లుల కడుపుకోత మహాసభ’లో అశ్వత్థామరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఐక్యతతోనే తమ సమ్మె ముందుకు సాగుతుందని చెప్పారు. బాధతో సమ్మెను కొనసాగిస్తున్నామని తెలిపారు. దేశంలో 56 మంచి ట్రాన్స్ పోర్టులు ఉంటే వాటితో సీఎం ఎందుకు పోల్చడం లేదని ప్రశ్నించారు. ప్రజా రవాణా బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆర్టీసీ అధికారుల బతుకు కుక్క బతుకు అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీము, నెత్తురు ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. సభకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా కార్మికులు హాజరయ్యారు.

90 నిమిషాలు వీలు చేసుకుంటే..

ఆర్టీసీ కార్మికుల గురించి సీఎం కేసీఆర్ తొంభై నిమిషాలు పెద్ద మనసుతో వీలు చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని అశ్వత్థామరెడ్డి అన్నారు. కేసీఆర్ మంచి తండ్రిలా చర్చలకు పిలవాలని కోరారు. చర్చలు ప్రారంభించి కార్మికుల్లో విశ్వాసం కల్పించాలన్నారు. ఒకటీ రెండు డిమాండ్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గినా ఓపిక పడతామని, కార్మికులు గుండె ధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని సందర్భాల్లో కొంత పట్టువిడుపులు తప్పవని, ఇప్పటికే 34 రోజులు చేశామన్నారు. హైకోర్టులో ఐఏఎస్ లు క్షమాపణ చెప్పాల్సి రావటం దారుణమన్నారు.

ఎవరు, ఎక్కడున్నా 9న ట్యాంక్ బండ్ రండి: కోదండరాం

ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఏ సమస్య అయినా చర్చలతోనే పరిష్కారం అవుతుందన్నారు. చర్చలు జరపాలనే డిమాండ్​తో ఈ నెల 9న ట్యాంక్ బండ్ పై నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, ఎవరు ఎక్కడున్నా మధ్యాహ్నం ఒంటి నుంచి పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులను అనుమతి కోరుతున్నామని చెప్పారు. ఆర్టీసీ అధికారులతో గురువారం సీఎం 9 గంటలు సమీక్ష చేపట్టారని, కార్మికులతో 90 నిమిషాలు మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కార్మికులను చూసి ప్రగతి భవన్ లో దాక్కోవద్దని, చర్చలు జరిపి ఆర్టీసీని బతికించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

కార్మికుల తెగువ, ధైర్యం గొప్పది

మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఎన్ఆర్ఐలు, పారిశ్రామిక వేత్తలు ఆదుకోవాలి. ఆ కుటుంబాలు తీవ్ర ఆవేదనతో ఉన్నాయి. మరణించిన కార్మికుల విగ్రహాలను వారు పనిచేసే డిపోల ముందు పెట్టాలి. ఆర్టీసీ జేఏసీ నేతలకు ఎన్నో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కానీ కార్మికులు చూపుతున్న తెగువ, ధైర్యం చాలా గొప్పది. ఇలానే ధైర్యంగా ఉండాలి.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు , జాజుల శ్రీనివాస్ గౌడ్

కేసీఆర్​కు గోరీ కట్టే రోజులు దగ్గరపడ్డయి

‘‘సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం కేసీఆర్.. రాజ్యాంగ వ్యవస్థను కాలరాస్తున్నాడు. సమ్మెను విఫలం చేయటానికి కుట్ర పన్నుతున్నాడు. ఇది నిజాం పాలన కాదు. నీకు గోరీ కట్టే రోజులు దగ్గరపడ్డయి.

– చింతా సాంబమూర్తి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి