టిమ్స్ మొరాయిస్తున్నయ్.. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల తిప్పలు

టిమ్స్ మొరాయిస్తున్నయ్.. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల తిప్పలు
  • టికెట్లు రావడానికి 3 నిమిషాలు 
  • టికెట్ రాలేదని డబ్బులు ఇవ్వకుండా దిగిపోతున్నరు 
  • ఆర్టీసీ ఆదాయంపై ప్రభావం
  • 3 వేల బస్సులుంటే.. ఉన్నవి 4 వేల టిమ్స్​ మాత్రమే 
  • అదనంగా మరోటి ఇవ్వాలని డిమాండ్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు జారీ చేసేందుకు తీసుకువచ్చిన టికెట్ ఇష్యూయింగ్ మెషీన్లు (టిమ్స్) మొరాయిస్తున్నాయి. రోజూ నగరంలోని పలు రూట్లలో నడుస్తున్న బస్సుల్లో సతాయిస్తుండడంతో కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్యాసింజర్లు తాము వెళ్లాల్సిన ప్రాంతం పేరు చెప్పి డబ్బులు చెల్లించగానే.. కండక్టర్లు డిటెయిల్స్​ఎంటర్​చేస్తారు. ఆ తర్వాత వెంటనే టికెట్​బయటకు వస్తుంది. అయితే, ప్రస్తుతం నగరంలోని బస్సుల్లో వాడుతున్న మెషీన్లలో టికెట్​రావడానికి 3 నుంచి 4 నిమిషాలు పడుతోంది. 

దీంతో ప్యాసింజర్లు కండక్టర్లతో గొడవపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు స్టేజీల్లో దిగాల్సినవారి గమ్యస్థానం రావడంతో దిగిపోతున్నారు. దీంతో సంస్థ ఆదాయం కోల్పోతుంది. ఇక ఒక్కొక్కరికి టికెట్​ఇవ్వడానికి నిమిషాల టైం పడుతుండడంతో కండక్టర్లు అసహనానికి గురవుతున్నారు. 

సరిపోని టిమ్స్​

గ్రేటర్​పరిధిలో 24 బస్​డిపోలు ఉండగా, ఒక్కో డిపో నుంచి వందకు పైగా బస్సులు రోజూ రోడ్ల మీదకు వస్తుంటాయి. మొత్తంగా సుమారు 3 వేల బస్సులు రోజూ ట్రిప్పలు వేస్తుండగా, కేవలం 4 వేల టిమ్స్​మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఒక్కో డిపోకు దాదాపు 40 టిమ్స్​మాత్రమే అదనంగా కేటాయించారు. దీంతో ఏ బస్సులో అదనంగా టిమ్​తీసుకువెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ మెషీన్​మొరాయించి పని చేయకుండా పోతే మళ్లీ డిపోకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. 

ఎందుకు మొరాయిస్తున్నాయి? 

సిటీలో ఒక్క బస్సులో కాదని, ప్రతిరోజూ చాలా బస్సుల్లో టిమ్స్​మొరాయిస్తున్నాయని, దీనివల్ల తాము ఇబ్బందులు  పడుతున్నామని కండక్టర్లు చెప్తున్నారు. దీనివల్ల చాలామంది టికెట్​రాకముందే మధ్యలోనే దిగిపోతున్నారని, దీనివల్ల సంస్థ ఇన్​కం కోల్పోతోందని చెప్తున్నారు.  మెట్రో ఎక్స్​ప్రెస్​లు, ఆర్డినరీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీం వల్ల మహిళలకు జీరో టికెట్​కొట్టాలన్నా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. టిమ్స్​ మొరాయింపు వల్ల డ్యూటీ టైంలో దాదాపు గంట వృథా అవుతోందంటున్నారు. 

ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోందో తెలుసుకుని భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూడాలని కోరుతున్నారు. ఒక్కో బస్సుకు ఒక్కో టిమ్​అదనంగా కేటాయించాలని కోరుతున్నారు.