
హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో కౌంటర్ వేశారు. ఆర్టీసీకి బకాయిలన్నీ చెల్లించేశామని, రూ.622 కోట్లు అదనంగా చెల్లించామని రెండు రోజుల క్రితం రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు తెలిపింది. అయితే బాకాయిలు చెల్లించామని చెబుతున్నారేగానీ, లెక్కలు సరిగా లేవని, ఇంకా బాకాయిలు ఉన్నాయో లేదో చెప్పడం లేదని హైకోర్టు ఎత్తిచూపింది. అసలు సర్కార్ నుంచి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉన్నాయో లేదో చెప్పాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ కౌంటర్ దాఖలు చేశారు. అందులో ప్రభుత్వం బకాయిలు ఏమీ చెల్లించక్కర్లేదని అంగీకరించారు.
2018–19లో రాయితీలు రూ.644 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించేసిందని స్పష్టం చేశారు. ఆర్థిక మాంద్యం పరిస్థితుల కారణంగా సాయం అందించలేమని ప్రభుత్వం అక్టోబర్ 30న లేఖ రాసింద పేర్కొన్నారు. ‘‘సిటీలో బస్సులు నడుపుతున్నందుకు జీహెచ్‌ఎంసీ రెండేళ్లల్లో రూ.336 కోట్లు(వరసగా రూ.108 కోట్లు, రూ.228 కోట్లు) ఇచ్చింది. 2016–2017లో ఆర్టీసీకి డబ్బులివ్వలేమని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ చెప్పింది. ఆర్థిక పరిస్థితి ఆశాజనంగా లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులిచ్చేందుకు వీల్లేకపోవడంతో ఆర్టీసీ ఏమీ చేయలేకపోతోంది. సమ్మె ప్రారంభమైన అక్టోబర్5 నుంచి అక్టోబర్30 నాటికి రూ.78 కోట్లు ఆదాయం వస్తే రూ.160 కోట్లు ఖర్చు అయింది. దీంతో రూ.82 కోట్లు నష్టం వచ్చింది. ఖర్చులు ఎక్కువగా నిర్వహణ, డీజిల్‌కే అవుతోంది. దేశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీలకు ఆర్థికంగా సాయం చేయడం లేదు. ప్రైవేటు బస్సులు లాభాల్లో ఉంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ప్రజల కోసం బస్సుల్ని నడుపుతున్నాం’’అని కౌంటర్‌లో తెలిపారు.