
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ అధికారులకు అలవెన్స్‌లు ఆపేస్తూ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ వైజర్ల నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు వరకు అలవెన్స్‌లు నిలుపుదల చేస్తూ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో చెల్లించే జనవరి జీతాలకు వర్తిస్తుందని ఆర్డర్స్‌లో పేర్కొన్నారు. కరోనా కారణంగా సంస్థ రెవెన్యూ తగ్గుతోందని, ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేవని, సంస్థ అవసరాల రీత్యా అలవెన్స్‌లు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే దాకా ఇవే అమల్లో ఉంటాయని వివరించారు. ప్రస్తుతం వివిధ రకాల పేరుతో అధికారుల అలవెన్స్‌లు తీసుకుంటున్నారు. వారికి ఇవి శాలరీతోపాటు అకౌంట్‌లో జమ కావు. సపరేట్‌గా నెలనెలకు బిల్లులు పెట్టి డ్రా చేస్తుంటారు. ప్రస్తుతం సూపర్‌వైజర్లకు రూ.1200 నుంచి రూ.2 వేలు, డీఎంలకు రూ.10 నుంచి రూ.15 వేలు, డీవీఎంలు, ఆర్‌ఎంలకు రూ.20 వేల దాకా, ఈడీలకు రూ.30 వేల దాకా అలవెన్స్‌లు ఉన్నాయి. ఇక నుంచి ఇవన్నీ ఆగిపోనున్నాయి.