దాడులకు పాల్పడితే ఊరుకోం.. కఠిన చర్యలు తీసుకుంటాం : ఎండీ సజ్జనార్

దాడులకు పాల్పడితే ఊరుకోం.. కఠిన చర్యలు తీసుకుంటాం : ఎండీ సజ్జనార్

ఆర్టీసీ సిబ్బందిని దూషించటం, దాడులు చేయటం వంటివి చేస్తే.. సహించేదే లేదన్నారు ఎండీ సజ్జనార్. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని... అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ లోని ఎంపీడీవో కార్యాలయం దగ్గర మంగళవారం(జనవరి 9) మధ్యాహ్నం ఓ వ్యక్తి బస్సు డ్రైవర్ పై దాడి చేశాడు.

బైక్ ను నిర్లక్ష్యంగా నడపి బస్సు ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ పై దుర్బాషలాడుతూ.. విచక్షణరహితంగా కొట్టాడు. ఇలాంటి దాడులను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు సజ్జనార్. ఈ ఘటనపై అందోల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడం జరిగిందని.. దీనిపై కేసు నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందని సజ్జనార్ తెలిపారు.

ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని సజ్జనార్ కోరారు.