ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తం : ఆర్టీసీ ఎండీ  సజ్జనార్

ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తం :  ఆర్టీసీ ఎండీ  సజ్జనార్

సికింద్రాబాద్, వెలుగు: డ్యూటీలోని ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ నెల 4న ఫరూఖ్​నగర్ డిపో 8ఏ రూట్ బస్సు  ట్యాంక్​బండ్​ నుంచి వెళ్తుండగా అడ్డంగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆపి  కండక్టర్ రమేశ్, డ్రైవర్ షేక్ అబ్దుల్​పై క్రికెట్ బ్యాట్​తో విచక్షణారహితంగా దాడి చేశారు. కండక్టర్​ రమేశ్​కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్​ను కూడా గాయపరిచారు. ఉద్యోగులను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కండక్టర్, డ్రైవర్​ను బుధవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరామర్శించారు.

ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును వారిని అడిగారు. ఎలాంటి ఆందోళన చెందొద్దని బాధిత ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సిబ్బంది తప్పులేదని, ఉద్దేశపూర్వకంగానే వారిపై దుండగులు దాడికి పాల్పడ్డారన్నారు. ఫిర్యాదు చేయగానే.. దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని  ఎండీ చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను టీఎస్ఆర్టీసీ ఏ మాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.