బస్సులు బయలుదేరే ముందు ..ప్రయాణికులకు సేఫ్టీ వివరాలు చెప్పాలి

బస్సులు బయలుదేరే ముందు ..ప్రయాణికులకు సేఫ్టీ వివరాలు చెప్పాలి
  • మియాపూర్ డిపోలో ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి  ఏసీ , నాన్ ఏసీ బస్సుల తనిఖీ  

 హైదరాబాద్ సిటీ, వెలుగు: కర్నూలు సమీపంలో ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్​బస్సుకు ప్రమాదం జరిగినే నేపథ్యంలో టీజీఎస్​ఆర్టీసీ బస్సుల తీరును సంస్థ వీసీ అండ్ ఎండీ వై. నాగిరెడ్డి సోమవారం పరిశీలించారు. సోమవారం అధికారులతో కలిసి మియాపూర్–-1 డిపోను తనిఖీ చేశారు.

 డిపోలోని లహరి స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులను తనిఖీ చేసి అందులో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఫైర్ డిటెక్షన్ అలారం, ఫైర్ సప్రెషన్ సిస్టమ్​పనితీరును పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్ పద్ధతులను సిబ్బంది, అధికారులతో సమీక్షించారు.

 బస్సులన్నింటిలో ఎమర్జెన్సీ డోర్లు, అద్దాలను పగలగొట్టేందుకు అవసరమైన సంఖ్యలో బ్రేకర్లు, ఫైర్​సేఫ్టీ పరికరాలు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాగిరెడ్డి మాట్లాడుతూ.. బస్సులు బయలుదేరే ముందు ప్రయాణికులకు వెల్కమ్ మెసేజ్ తో పాటు సేఫ్టీకి సంబంధించిన వివరాలు చెప్పాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ముందుగా ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేయాలన్నారు.