హైదరాబాద్ సిటీ, వెలుగు : తెలంగాణ, ఏపీకి కజకిస్తాన్ గౌరవ కాన్సుల్‌గా పనిచేస్తున్న డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్‌కు అమెరికా కాంగ్రెస్ నుంచి ప్రతిష్ఠాత్మకమైన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెషనల్ మెడలియన్, కాంగ్రెషనల్ ప్రొక్లమేషన్ పురస్కారాలు లభించాయి. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు జోనాథన్ ఎల్.జాక్సన్ నుంచి అలీఖాన్పురస్కారం అందుకున్నారు. కాంగ్రెషనల్ మెడలియన్ సమాజ సేవ, దౌత్య రంగం, ప్రపంచ అభివృద్ధికి చేసిన విశిష్ట కృషికి ఈ పుస్కారం అందజేస్తుంది.
“డాక్టర్ ఖాన్ అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడంలో, దేశాల మధ్య వారధిగా నిలవడంలో అసాధారణ నాయకత్వం ప్రదర్శించారు. అంతర్జాతీయ సహకారం, వాణిజ్యంలో ఆయన కృషి ప్రతిబింబిస్తుంది. అమెరికా, కజకిస్తాన్, భారత్ మధ్య శాంతి, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడంలో ఆయన అంకితభావం అపారం” అని జోనాథన్ ఎల్.జాక్సన్ కొనియాడారు.
