
వరంగల్, వెలుగు: వరంగల్ ఆర్టీసీ రీజియన్‍కు మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన వరంగల్ రీజియన్‍లోని హనుమకొండ కొత్త బస్టాండ్‌ను సందర్శించి, అందుతున్న సేవలను తెలుసుకున్నారు. డిపోలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శాఖ తరఫున ఉత్తమ ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‍లకు ప్రగతిచక్ర అవార్డులు అందించారు. ఆర్‍ఎం, డిప్యూటీ ఆర్‍ఎంలు, డిపో మేనేజర్లతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో 1000 బస్సుల ద్వారా 4 లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాల గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు చెప్పారు. త్వరలో రీజియన్‍కు అందించబోయే 100 ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్ వరంగల్ పరిధిలో నడపనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కరీంనగర్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్, వరంగల్ రీజియన్ మేనేజర్ విజయభాను, డిప్యూటీ ఆర్‍ఎంలు భాను కిరణ్‍తో పాటు రవీందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.