గవర్నర్ వద్ద ఆర్టీసీ బిల్లు..పుదుచ్చేరిలో​ తమిళిసై

గవర్నర్ వద్ద ఆర్టీసీ బిల్లు..పుదుచ్చేరిలో​ తమిళిసై
  • గవర్నర్ వద్ద ఆర్టీసీ బిల్లు.. ఈ నెల 2న పంపిన ప్రభుత్వం 
  • అప్పటికే పుదుచ్చేరికి వెళ్లిన గవర్నర్​ తమిళిసై 
  • 8న తిరిగి హైదరాబాద్​కు రాక  ఇయ్యాల్టితో ముగియనున్న అసెంబ్లీ సెషన్ 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లుపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఈ నెల 2న గవర్నర్ ఆమోదం కోసం బిల్లును రాజ్ భవన్ కు పంపింది. అయితే అప్పటికే గవర్నర్ తమిళిసై పుదుచ్చేరి పర్యటనకు వెళ్లారు. గవర్నర్ హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి బయల్దేరిన తర్వాత ఆర్టీసీ విలీన బిల్లు రాజ్ భవన్ కు చేరిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. 

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ వ్యవహరిస్తున్న తమిళిసై.. ప్రస్తుతం అక్కడ పర్యటిస్తున్నారు. ఆమె ఈ నెల 8న తిరిగి హైదరాబాద్ కు వస్తారని రాజ్ భవన్ అధికారులు అంటున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బిల్లుపై సందిగ్ధం నెలకొంది. 

ఇదీ సర్కార్ వాదన.. 

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ విలీనం పూర్తి చేయాలని భావించామని, కానీ గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపడం లేదని రాష్ట్ర సర్కార్ ఆరోపించింది. ‘‘ఇది ఫైనాన్స్ బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం పంపాం. రెండ్రోజులుగా గవర్నర్ తన అభిప్రాయం చెప్పలేదు. గవర్నర్ వైఖరి చూస్తుంటే.. ప్రభుత్వంపై వ్యతిరేక ధోరణితో మిగతా బిల్లులను ఆపినట్టే ఆర్టీసి బిల్లును ఆపుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆపి ఇటు ప్రభుత్వాన్ని, అటు ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు” అంటూ ప్రభుత్వం మీడియాకు లీక్ ఇచ్చింది.  

రాజ్ భవన్ ఏమన్నదంటే..  

ప్రభుత్వ ఆరోపణలను రాజ్ భవన్ ఖండించింది. బిల్లును గవర్నర్ ఆపుతున్నారంటూ ప్రచారం కావడంతో క్లారిటీ ఇచ్చింది. “ఆర్టీసీ విలీన బిల్లు రాజ్ భవన్ కు ఈ నెల 2న సాయంత్రం 3:30 గంటలకు వచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఈ బిల్లుపై నిర్ణయం తీసుకునే ముందు లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంది” అని రాజ్ భవన్ ప్రెస్ సెక్రటరీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. బిల్లును గవర్నర్ పరిశీలించారని, అయితే అందులో కొన్ని అంశాలపై సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారని చెప్పారు.