
- రేపో, ఎల్లుండో గుర్తింపు యూనియన్ టీఎంయూ నోటీస్
- ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పెరుగుతున్న ఒత్తిడి
- ఏ ప్రకటనా చేయని సర్కారు, కార్మికుల గుర్రు
- సమ్మె చేస్తే ఆర్టీసీకి రోజుకు రూ.11 కోట్లు లాస్
ఆర్టీసీలో సమ్మె తప్పేలా లేదు. వరుసగా సంఘాలన్నీ నోటీస్‌లు ఇస్తున్నాయి. ఇప్పటికే మూడు సంఘాలు ఇవ్వగా, రేపో, ఎల్లుండో గుర్తింపు యూనియన్ టీఎంయూ కూడా సమ్మె నోటీస్ ఇవ్వనుంది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి కేబినెట్ ఓకే చెప్పడంతో ఇక్కడి కార్మికులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పుడైనా సమ్మెకు వెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. కార్మిక సంఘాల్లో హడావుడి కన్పిస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏ ప్రకటన చేయలేదు.
ఉద్యమ సమయం, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని ఆర్టీసీ వర్కర్లు మండిపడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించాలని సంఘాలపై ఒత్తిడి తెస్తున్నారు. త్వరలో కేబినెట్ మీటింగ్, బడ్జెట్ సమావేశాలుండడంతో పెండింగ్ సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 31 తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, ఈ నెల 3న ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చాయి. శుక్రవారం ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నోటీస్ ఇచ్చింది. ఇక గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ సోమ లేదా మంగళవారం స్ట్రైక్ నోటీస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. మరో సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ సమ్మె నోటీస్‌పై చర్చిస్తోంది. నోటీస్ ఇచ్చిన రెండు వారాల తర్వాత, 45 రోజుల్లోపు సమ్మెలోకి వెళ్లవచ్చు.
స్పందించని సర్కార్.. పెరుగుతున్న ఒత్తిడి
ఇప్పటికే కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. డిపోలు, రీజినల్ ఆఫీస్‌లు, బస్ భవన్, ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేశాయి. మధ్యాహ్న భోజన సమయంలో వినతి పత్రాలిచ్చాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సమ్మే మార్గమని కార్మిక సంఘాలంటున్నాయి. గతంలో ఒకటో తేదీనే శాలరీలు వచ్చాయని, ఇటీవల 7వ తేదీ దాకా రావడం లేదని కార్మికులు చెబుతున్నారు. ఆర్టీసీకి చైర్మన్, ఎండీని నియమించకపోవడంతోనే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతోందంటున్నారు.
విడివిడిగా నోటీసులిస్తున్నా.. ఒక్కటిగానే ఉద్యమం
అన్ని ఆర్టీసీ యూనియన్లు వేర్వేరుగా సమ్మె నోటీసులిస్తున్నాయి. అయితే ఏ సంఘం ముందుగా సమ్మెలోకి వెళ్లినా అన్ని సంఘాలూ ఒకే తాటిపైకొచ్చి నిరసనల్లో పాల్గొంటాయని యూనియన్ నేతలంటున్నారు. మరో వైపు స్ట్రైక్‌కు వెళితే ఆర్టీసీ రోజుకు సుమారు11 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోనుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి మరింత ఇబ్బందిగా మారనుంది.
ఇవీ డిమాండ్లు..
..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
..వేతన సవరణ చేపట్టాలి
..ప్రతి నెలా ఒకటో తేదీనే శాలరీలివ్వాలి
..సీసీఎస్, ఏఆర్‌బీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లించాలి
..డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు భర్తీ చేయాలి
..గ్యారేజీ కార్మికులకు 21 రోజులకే ఇన్సెంటివ్ క్లాస్ అమలు చేయాలి
..మహిళా కండక్టర్లకు అన్ని డిపోల్లో ప్రత్యేక చార్టులు, రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలి
..విధి నిర్వహణలో చనిపోతే 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
..అద్దె బస్సులు రద్దు చేసి, కొత్త బస్సులు కొనాలి
..కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
..టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్‌స్పెషాలిటీ హాస్పటల్‌గా మార్చాలి
..బలవంతంగా టివ్ విధులకు పంపించొద్దు
..పెండింగ్ ఎన్‌క్యాష్‌మెంట్, డీఏ ఎరియర్స్ రిలీజ్ చేయాలి
..పలు రకాల టాక్స్‌లు రద్దు చేయాలి