ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయం లీగలా? ఇల్లీగలా?: హైకోర్టు

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయం లీగలా? ఇల్లీగలా?: హైకోర్టు

రాష్ట్రంలోని 5100 ఆర్టీసీ బస్సు రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం కేసును రేపటికి వాయిదా వేస్తూ.. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై గతంలో విధించిన స్టేను కొనసాగించింది. ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని, అయితే ప్రైవేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయం లీగలా? ఇల్లీగలా అని తేలాల్సి ఉందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ప్రైవేటీకరణ ఇంకా అమలులోకి రాలేదు

రూట్ల ప్రైవేటీకరణపై విచారణ ప్రారంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రదాన కార్యదర్శి అదనపు అఫడవిట్‌ను దాఖలు చేశారు. ప్రైవేటీకరణపై కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఇంకా అమల్లోకి రాలేదని అఫిడవిట్‌లో తెలిపారు. అయితే కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయడం సరికాదని, ఈ పిటిషన్‌ను కొట్టేయాలని సీఎస్ అన్నారు. రూట్ల ప్రైవేటీకరణపై ప్రభుత్వం జీవో జారీ చేసేవరకు ఈ అంశాన్ని రహస్యంగా ఉంచాలని కోర్టు కోరారాయన.

ఆర్టీసీకి చెప్పకుండా నిర్ణయం ఎలా?

ప్రభుత్వం తరఫున వాదనలు విన్న కోర్టు.. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని చెప్పింది. ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పేలా అవుతుందో చెప్పాలన్నారు న్యాయమూర్తులు. ప్రపంచం… గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ కాలంలో ఉందని వ్యాఖ్యానించారు.  ఒకప్పుడు దేశంలో ఇండియన్ ఎయిర్ లైన్ మాత్రమే ఉండేది.. స్కై ఓపెన్ చేశాక.. కింగ్ ఫిషర్ వంటి కొన్ని ప్రైవేటు ఎయిర్ లైన్స్ రాణించ లేక పోయినప్పాటికీ.. చాలా ఎయిర్ లైన్స్ విజయవంత మయ్యాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు లాయర్ ప్రభాకర్ వాదిస్తూ ప్రైవేటీకరణ నిర్ణయం విషయంలో ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలొ కాలేదన్నారు. సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలన్నారు. ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగదని సీఎం అన్నారని ఆయన చెప్పారు. దీనిపై కోర్టు కలుగజేసుకుని, సీఎం ఏమన్నారన్నది న్యాయస్థానానికి సంబంధం లేదని, కేబినెట్ నిర్ణయం చట్టబద్ధమా? చట్ట విరుద్ధమా? అనేది తమ ముందున్న అంశం అని స్పష్టం చేసింది.

న్యూస్ పేపర్లలో వేసి.. అభిప్రాయాలు తీసుకోవాలి

సెక్షన్ 102 ప్రకారం ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటో వివరించాలని హైకోర్టు చెప్పింది. చట్టం ప్రకారం ఆర్టీసీకి సమాచారం కేబినెట్ నిర్ణయం తీసుకునే ముందే ఇవ్వాలా?  తర్వాత ఇవ్వాలా? అని ప్రశ్నించింది. చట్టం ప్రకారం రవాణా వ్యవస్థలో చేసే మార్పులను గెజిట్ రూపంలో ప్రచురించాలని, న్యూస్ పేపర్లలో యాడ్ ఇవ్వాలని చెప్పారు. దానిపై అభ్యంతరాలు స్వీకరించేందుకు 30 రోజుల టైం ఇవ్వాలని తెలిపారు. ఈ ప్రొసీజర్‌ను ఎందుకు ఫాలో అవ్వలేదని ప్రశ్నించిన హైకోర్టు.. కేబినెట్ నిర్ణయంపై స్టే కొనసాగించి, విచారణను రేపటికి వాయిదా వేసింది.

లేటెస్ట్ న్యూస్ కోసం క్లిక్ చేయండి