మేడారం వల్ల రెగ్యులర్ సర్వీసులను తగ్గించినం: సజ్జనార్

మేడారం వల్ల రెగ్యులర్ సర్వీసులను తగ్గించినం: సజ్జనార్
  • జాతర పూర్తయ్యేదాకా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోండి
  • ప్రజలకు ఆర్టీసీ వినతి

హైదరాబాద్, వెలుగు: మేడారం జాతరకు వస్తున్న భక్తుల కోసం  రాష్ర్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 6 వేల బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.  రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయన్నారు. ఈ సందర్భంగా  హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో రెగ్యులర్ సర్వీసులను తగ్గించామని చెప్పారు. రెగ్యులర్ బస్సుల కొరత నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో  రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌‌, ఖమ్మం,  కరీంనగర్‌‌, ఆదిలాబాద్‌‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నామని సజ్జనార్ వెల్లడించారు. 

మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. తెలంగాణకే తలమానికమైన మేడారం జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. జాతర పూర్తయ్యేవరకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జంటనగరాల్లో సాధారణ రోజుల్లో 2 వేల సిటీ బస్సులు నడుస్తుండగా.. ప్రస్తుతం 800 బస్సులు మాత్రమే నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగతా బస్సులు అన్ని మేడారం కు రన్ చేస్తున్నామని, రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు సిటీ బస్సుల్లో 500 బస్సులను రెడీగా ఉంచామంటున్నారు. దీంతో సిటీలో బస్సుల తక్కువయ్యాయని, ప్యాసింజర్లు అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.