వెనక్కి తగ్గని కార్మికులు..ఎక్కడి బస్సులు అక్కడ్నే

వెనక్కి తగ్గని కార్మికులు..ఎక్కడి బస్సులు అక్కడ్నే
  • సర్కారు హెచ్చరించినా వెనక్కి తగ్గని కార్మికులు
  • 49,733 మందిలో 160 మంది మాత్రమే హాజరు!

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. డ్యూటీలకు హాజరుకాకపోతే ఉద్యోగంలోంచి తొలగిస్తామని సర్కారు హెచ్చరించినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. శనివారం తెల్లవారుజామున మొదటి షిఫ్టు నుంచే సమ్మె మొదలుపెట్టారు. డిపోల్లోంచి బస్సులు బయటికి రాలేదు. ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా 49,733 మంది ఉద్యోగులు ఉండగా 160 మంది మాత్రమే డ్యూటీలకు హాజరైనట్టు తెలిసింది. సమ్మె నేపథ్యంలో అధికారులు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రైవేటు బస్సులు, మ్యాక్సీ క్యాబ్​లు రోడ్లపైకి వచ్చేలా చూశారు. వేల సంఖ్యలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుని, పోలీసు భద్రత మధ్య కొన్ని మార్గాల్లో బస్సులు నడిపారు. అధికారులు ఎంతగా ప్రయత్నించినా ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు.

144 సెక్షన్‌‌.. అరెస్టులు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శుక్రవారం రాత్రి నుంచే డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసులను మోహరించారు. అన్ని డిపోలు, బస్టాండ్ల వద్ద 144 సెక్షన్‌‌ విధించారు. అయినా కార్మికులు డిపోలు, బస్టాండ్ల వద్ద ఆందోళనలు చేశారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, పోలీస్​స్టేషన్లకు తరలించారు.

ప్రయాణికులకు ఇబ్బందులు

సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఆదివారం సద్దుల బతుకమ్మ, మంగళవారం దసరా నేపథ్యంలో చాలా మంది ఊర్లకు వెళ్లేందుకు తిప్పలు పడ్డారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో పరిమితికి మించి జనం ఎక్కారు. అధికారులు కొన్ని డిపోలు, బస్టాండ్లలో కంట్రోల్‌‌ రూమ్‌‌లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌‌ లో నగర శివార్లకే పరిమితమైన సెవెన్  సీటర్  ఆటోలను సిటీలోకి అనుమతించారు.

ప్రైవేట్‌‌ వసూళ్ల మోత

బస్సుల బంద్‌‌తో జనం ప్రైవేట్​ వాహనాలు, ఆటోలను ఆశ్రయించారు. డిమాండ్​ పెరగడంతో వాళ్లు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేశారు. ప్రైవేట్‌‌  ట్రావెల్స్‌‌  బస్సుల వారైతే రెండు, మూడు రెట్లు అధికంగా చార్జీ తీసుకుంటున్నాయి. సాధారణంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్‌‌, వరంగల్, నిజామాబాద్​ తదితర ప్రాంతాలకు రూ.200 వరకు ఆర్టీసీ చార్జీ కాగా రూ.750 నుంచి రూ.వెయ్యి దాకా వసూలు చేస్తున్నారు. ఇక సమ్మెతో తెలంగాణ బస్సులు ఆగిపోవడంతో ఏపీ ఆర్టీసీ అదనపు సర్వీసులను నడిపిస్తోంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు సుమారు 700 అదనపు సర్వీసులను నడుపుతోంది.

ఇంకా అందని జీతాలు

ఆర్టీసీలో కార్మికులు, ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు. సాధారణంగా ఒకటో తేదీనే అకౌంట్లలో జీతాలు జమ చేయాలి. కొద్దినెలలుగా ఐదు, ఆరో తేదీన కూడా వేస్తున్నారు. ఇప్పుడు జీతాలు పడే లోపే కార్మికులంతా సమ్మెలోకి వెళ్లారు. దీంతో ఈ నెల జీతాల చెల్లింపుపై ఉత్కంఠ నెలకొంది.