టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై సమ్మె ఒత్తిడి

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై సమ్మె ఒత్తిడి

బయటకు వస్తే నిలదీస్తున్న ఆర్టీసీ కార్మికులు
ముత్తిరెడ్డి వ్యాఖ్యల కలకలంతో సైలెంట్​​ మోడ్​లోకి
ఇళ్ల ముట్టడి తర్వాత సెగ్మెంట్లలో పర్యటనలు రద్దు
క్యాంప్​ ఆఫీసుల వైపు కన్నెత్తి చూడని పలువురు
హైదరాబాద్​కే పరిమితమైన మెజారిటీ ఎమ్మెల్యేలు
బయటకు వస్తే నిలదీస్తున్న ఆర్టీసీ కార్మికులు
ముత్తిరెడ్డి వ్యాఖ్యల కలకలంతో సైలెంట్‌​ మోడ్​లోకి
నియోజకవర్గాల్లో పర్యటనలు రద్దు
సిటీలోనే మెజారిటీ ఎమ్మెల్యేలు

వెలుగు, హైదరాబాద్:ఆర్టీసీ సమ్మె టీఆర్​ఎస్ ఎమ్మెల్యేలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. బయటకు వస్తే కార్మికులు, సామాన్యులు నిలదీస్తుండడంతో చాలా మంది అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. సమ్మెలో భాగంగా కార్మికులు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించాక చాలామంది నియోజకవర్గాల్లో పర్యటనలు తగ్గించి, హైదరాబాద్​లోనే ఉంటున్నారు. సమ్మె వెనుక టీఆర్​ఎస్​ నేతలు ఉన్నారంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్యానించి, హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఏం మాట్లాడితే ఏమవుతుందోననే ఆందోళనలో అంతా సైలెంట్ మోడ్​లోకి వెళ్లిపోయారు. సమ్మె కారణంగా ఎమ్మెల్యేలకు పోలీసులు భద్రత పెంచారు. కార్మికుల ఆందోళన కార్యక్రమాలు పూర్తయ్యాకే మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

పర్యటనల్లేవ్​.. సమీక్షల్లేవ్​..

ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి ఆసిఫాబాద్​ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప అసలు బయటకు రావడంలేదు. వీరిద్దరూ క్యాంపు ఆఫీస్ కు కూడా రావడంలేదు. జిల్లాలో ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించడంలేదు. భారీ వర్షాలతో పంట నష్టం జరిగినా పరిశీలనకు వెళ్లలేదు.

ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు కనీసం జడ్పీ సమావేశాలకు కూడా హాజరుకావడంలేదు. నాలుగు రోజుల క్రితం ఆదిలాబాద్​లో జరిగిన జడ్పీ స్టాండింగ్​ కమిటీ సమావేశానికి మాజీ మంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్​ బాపురావు రాలేదు. జిల్లాలో ఆర్టీసీ సమ్మె కారణంగా అన్ని రకాల అధికారిక కార్యక్రమాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ఎక్కువ రోజులు హైదరాబాద్ లో ఉన్నారు. మూడు రోజుల క్రితం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పదిహేను రోజులుగా జిల్లాకు రాలేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ నెల 15 వరకు ఓరియంట్ సిమెంటు కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్​కే పరిమితమయ్యారు.

కరీంనగర్‍ జిల్లాలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్​, కొప్పుల ఈశ్వర్​ కలిసి ఈ నెల 16న ధాన్యం కొనుగోళ్లపై, 17న జనరల్​ సమీక్ష చేపట్టి వెళ్లారు. ఆ తర్వాత ఎలాంటి అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేదు. మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ చివరి సారిగా దసరా ఉత్సవాలకు వచ్చారు. మళ్లీ నియోజకవర్గానికి రాలేదు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లోకల్​గానే ఉంటున్నా బయటకు రావడంలేదు.

పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ సెగ తగలవచ్చనే అనుమానంతో మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోవడం, కోరం లేకపోవడంతో ఈ నెల 15న జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు.

ఆర్టీసీ సమ్మె కారణంగా అక్టోబర్​5న రాష్ట్ర మంత్రి కేటీఆర్‍ తన వరంగల్‍ సిటీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన హన్మకొండలోని భద్రకాళి బండ్‍ ప్రారంభోత్సవానికి రావాల్సి ఉండగా రాలేదు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సొంత పనులపై అమెరికా వెళ్లారు. వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్​విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍, వరంగల్‍ తూర్పు, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‍, అరూరి రమేశ్‍ ఆచితూచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మహబూబాబాద్​ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలోనే ఎక్కువగా గడిపారు. సమ్మె సమయంలో జిల్లాకు రావడానికి పెద్దగా ఇష్టం చూపలేదు. ప్రచారం ముగిసిన తర్వాత సైతం హైదరాబాద్​లోనే ఉన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఉగ్గంపల్లి లోని తన ఇంటి వద్దే ఉంటున్నప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. ‌‌

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్‌‌‌‌రావు మాత్రమే యథావిధిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ జిల్లాలో తిరుగుతున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ నియోజక వర్గానికి వచ్చి వెళ్తున్నా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

సంగారెడ్డి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు వారం రోజులుగా క్యాంపు ఆఫీసులకు రావడం మానేశారు. గ్రామాల్లో పర్యటనలు రద్దు చేసుకున్నారు. ఇటీవల మంత్రి హరీశ్​ రావు పటాన్ చెరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నా, సమ్మె ఎఫెక్ట్ తో వాయిదా వేసుకున్నారు. మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పలు అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, ఎలాంటి హడావుడి లేకుండా అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. గతంలో మాదిరిగా ఆమె మెదక్​లోని క్యాంపు ఆఫీస్​లో ఎక్కువగా కనిపించడం లేదు. నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​రెడ్డి దసరా తర్వాత ఇప్పటివరకు నర్సాపూర్​లోని క్యాంపు ఆఫీసుకు రాలేదు.

మహబూబ్​నగర్​లో మంత్రులు, ఎమ్మెల్యేలపై సమ్మె ఎఫెక్ట్​ ఎక్కువగానే ఉంది. శనివారం సాయంత్రం నారాయణపేట జిల్లాలోని మక్తల్ మార్కెట్ యార్డులో షాపింగ్​కాంప్లెక్స్​ఓపెనింగ్​ఆర్టీసీ కార్మికుల ఆందోళన భయంతో వాయిదా పడింది. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు హజరుకావాల్సి ఉంది. వారం క్రితం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కార్మికులు అడ్డుకోగా పోలీసుల సాయంతో బయటపడాల్సి వచ్చింది. పాలమూరు మున్సిపాలిటీలో 30 రోజుల ప్రణాళికపై సమావేశాన్ని ఉదయం 8.30 గంటలకే కార్యక్రమం మెుక్కుబడిగా చేపట్టారు. సమ్మె కారణంగా ప్రజాప్రతినిధులకు పోలీసులు భద్రత పెంచారు. కార్మికుల ఆందోళన కార్యక్రమాలు పూర్తయ్యాకే మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడుచోట్ల క్యాంపు కార్యాలయాలు అందుబాటులో ఉండగా, ఎమ్మెల్యేలు రావడం మానేశారు. నల్గొండ, సూర్యపేట జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలంతా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆర్టీసీ సమ్మెపై ఎక్కడా పెదవి విప్పడంలేదు.

ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సమ్మె మొదలైనప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. దసరా పండుగ సమయంలో రెండు రోజులు ఖమ్మం వచ్చివెళ్లారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ నియోజకవర్గంలో ఉంటున్నా, పెద్దగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు.