హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 29న పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు శనివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్లుఅధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఎదురైతే support@tslprb.in కు ఈ-మెయిల్ చేయాలని, లేదా పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య 9391005006 ను సంప్రదించాలన్నారు. అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ఏ4 సైజు పేపర్‌పై ఇరువైపులా (సింగిల్ షీట్‌గా) ప్రింట్ తీసుకోవాలని, అప్లోడ్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటోను కేటాయించిన చోట అతికించాలన్నారు.
