కార్మికుల ముట్టడి.. పోలీసుల కట్టడి!

కార్మికుల ముట్టడి..  పోలీసుల కట్టడి!
  • సమ్మెలో భాగంగా ప్రజాప్రతినిధుల ఇండ్లు  ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు
  • ఎక్కడిక్కడ అడ్డుకున్న పోలీసులు
  •  పలుచోట్ల తోపులాట, ఉద్రిక్తత

సమ్మెలో భాగంగా ప్రజాప్రతినిధుల ఇండ్ల ముట్టడికి ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. వీరిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను సైతం లెక్క చేయకుండా కొన్ని చోట్ల కార్మికులు, అఖిలపక్ష నేతలు నిరసనలకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను తోసుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో చాలాచోట్ల ఉద్రిక్తత ఏర్పడింది.

వెలుగు నెట్‌వర్క్: ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి సోమవారం మంత్రులు, ఆటీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడించారు. సమ్మె శిబిరాల నుంచి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల ఇండ్లు, క్యాంపు ఆఫీస్‌ల వైపు ర్యాలీగా వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలుజిల్లాల్లో నిరసనకారులకు, పోలీసులకు నడుమ వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి.

మహబూబ్‌నగర్​లో మంత్రి శ్రీనివాస్​గౌడ్ ఇంటి ముట్టడికి వెళ్లిన కార్మికులు, అఖిలపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ నాయకులను అరెస్ట్​చేశారు. వనపర్తిలో మంత్రి నిరంజన్​రెడ్డి, నాగర్​కర్నూల్​లో  ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటిని కార్మికులు ముట్టడించారు. కొల్లాపూర్​లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి ఇంటిని కార్మికులు ముట్టడించారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ఇంటిని, జోగులాంబ గద్వాల జిల్లాలో బండ్ల కృష్ణమోహన్​రెడ్డి ఇంటిని  ముట్టడించి, వినతిపత్రాలు సమర్పించారు.

సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి ర్యాలీగా వెళ్లిన కార్మికులు, నాయకులను స్థానిక శంకర్‌ విలాస్‌ సెంటర్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కార్మికులు, నాయకులు అక్కడే రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.  నల్గొండ, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడతో పాటు మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఇండ్ల ముందు ధర్నాలు నిర్వహించారు.

హన్మకొండ సిటీలో పంచాయతీరాజ్‍శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్‍, ప్రభుత్వ చీఫ్‍విప్‍ వినయ్‍భాస్కర్‍ క్యాంప్‍ ఆఫీసులతో  పాటు  అందరు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి కార్మికులు ప్రయత్నించారు. దీంతో ఆయా చోట్ల పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి.    హన్మకొండ హంటర్​ రోడ్డులోని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే సతీష్‍బాబు ఇంటిముందు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చావు డప్పు మోగించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.

సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు ఇంటి ముట్టడికి ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. గజ్వేల్​లో ఎమ్మెల్యే(సీఎం) క్యాంప్​ఆఫీసును ముట్టడించకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్​లో ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​ మట్టడికి యత్నించిన కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, శివసేన పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. మెదక్ లో​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి క్యాంపు కార్యాలయం వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఆదిలాబాద్ లో  ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు ఇళ్లను ముట్టడించగా కార్మికుల సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్తాతానని బాపురావు హామీనిచ్చారు. ఆసిఫాబాద్ లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్​పర్సన్​ కోవ లక్ష్మి , మంచిర్యాలలో దివాకర్ రావు, నిర్మల్ లో మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి,  బైంసా మండలంలోని దెగామలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్ లో ఎమ్మెల్యే రేఖా నాయక్ క్యాంపు ఆఫీస్​ను  ముట్టడించేందుకు ప్రయత్నించారు

ఖమ్మంలో ఎంపీ  నామా నాగేశ్వరరావు ఇంటి ముట్టడికి తరలిన కార్మికులు, అఖిలపక్ష నేతలను  అరెస్ట్​ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​కార్యాలయాన్ని ముట్టడించారు. పాల్వంచలోని కొత్తగూడెం  ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావు ఇంటి వద్ద నిరసన చేపట్టారు. మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే రేగా కాంతారావు క్యాంప్​ఆఫీస్​ను ముట్టడించారు.  అశ్వారావుపేట  ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు.

కరీంనగర్‌‌లో కాంగ్రెస్‌ నాయకులు మంత్రి గంగు కమలాకర్ ఇంటి ముట్టడికి ప్రయత్నించగా అరెస్టు చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ వర్క్ షాపులో వంటవార్పు చేపట్టారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌‌రెడ్డి, మంథనిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ఎదుట  కార్మికులు ఆందోళన చేపట్టారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌‌ క్యాంప్‌ ఆఫీస్‌ ఎదుట, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌రావు, వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఇంటి ఎదుట కార్మికులు, అఖిల పక్ష నాయకులు ఆందోళన చేశారు.

నిజామాబాద్​ అర్బన్​ఎమ్మెల్యే గణేశ్​గుప్తా, రూరల్​ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఆర్మూర్​ఎమ్మెల్యే జీవన్​రెడ్డి, బోధన్​ ఎమ్మెల్యే షకీల్ ఇళ్లను కార్మికులు ముట్టడించడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.