
ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, లేనిపక్షంలో దసరా పండుగకు ముందే సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ జేఏసీ వన్ కన్వీనర్ హనుమంతు తెలిపారు. ఆర్టీసీలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లో కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న అన్ని యూనియన్లను చర్చలకు పిలిచి సమావేశాన్ని రద్దు చేశారని, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో తేదీ ప్రకటించలేదని చెప్పారు. దాంతో తాము చట్టపరంగా సమ్మెలోకి వెళ్లడానికి నిర్ణయించినట్లు జేసీకి తెలిపినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ కాలపరిమితి 2018 ఆగస్టు 7వ తేదీతో ముగిసిందని, ఇప్పుడు అన్ని యూనియన్లు సమానమేనని స్పష్టం చేశారు. ఏ యూనియన్‌కూ పాలసీ మ్యాటర్లపై ఒప్పందం చేసుకునే అధికారం లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోరాడారని, ఇప్పుడు విస్మరించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఏమాత్రం ఆదుకోవడం లేదని, భయపెట్టి నోరు మూయిస్తామంటే భయపడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ సాధనకు ఎలా పోరాడామో అదే విధంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ వన్ కోకన్వీనర్ సుద్దాల సురేశ్, గుండ్ల ఆంజనేయులు, సుధాకర్, శ్రీనివాస్, నర్సింగ్‌రావు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.