ఆర్టీఐకి  ఐదుగురు కమిషనర్లు

ఆర్టీఐకి  ఐదుగురు కమిషనర్లు

ఇద్దరు జర్నలిస్టులకు, మైనార్టీ కోటాలో మరో ఇద్దరికి చాన్స్‌

ప్రభుత్వం రాష్ట్ర సమాచార (ఆర్టీఐ) కమిషనర్లుగా ఐదుగురిని నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఇద్దరు జర్నలిస్టులు కట్టా శేఖర్‌రెడ్డి, ఎం.నారాయణరెడ్డి, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన గుగులోతు శంకర్‌నాయక్‌తోపాటు మైనార్టీ కోటాలో సయ్యద్‌ ఖలీలుల్లా, మహ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌ లకు అవకాశమిచ్చింది.

ప్రభుత్వం రాష్ట్ర సమాచార (ఆర్టీఐ) కమిషనర్లుగా ఐదుగురిని నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఇద్దరు జర్నలిస్టులు కట్టా శేఖర్‌రెడ్డి, ఎం.నారాయణరెడ్డి, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన గుగులోతు శంకర్‌నాయక్‌తోపాటు మైనార్టీ కోటాలో సయ్యద్‌ ఖలీలుల్లా, మహ్మద్‌ అమీర్‌ హుస్సేన్‌ లకు అవకాశమిచ్చింది. ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన సెర్చ్‌ కమిటీ సభ్యులు మంత్రి ప్రశాంత్​రెడ్డి, మజ్లిస్​ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్​ ఒవైసీ ఈ పేర్లను ఫైనల్‌ చేసి, గవర్నర్‌కు నివేదించారు. ప్రభుత్వ సిఫార్సులపై గవర్నర్  సోమవారం ఆమోదముద్ర వేశారు. కొత్త సమాచార కమిషనర్లు మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా అసెంబ్లీ మాజీ సెక్రెటరీ రాజ సదారాం, కమిషనర్‌గా జర్నలిస్టు బుద్ధా మురళి కొనసాగుతున్నారు.

కట్టా శేఖర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. 33 ఏండ్ల నుంచి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. నమస్తే తెలంగాణ దినపత్రికకు మొదటల్లో సీఈవోగా, తర్వాత ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది డిసెంబర్‌లో రిటైర్‌ అయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

మైద నారాయణరెడ్డి టీన్యూస్‌  చానల్​ ఆవిర్భావం నుంచి సీఈవోగా పనిచేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం ముబరాస్‌పూర్‌ ఆయన స్వస్థలం. పలు మీడియా సంస్థల్లో సబ్‌ ఎడిటర్‌ నుంచి ఎడిటర్‌  స్థాయి వరకు పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 నుంచి 19 వరకు ప్రెస్‌ అకాడమీ మెంబర్‌గా కొనసాగారు.

డాక్టర్‌ గుగులోతు శంకర్‌నాయక్‌ ఉస్మానియా వర్సిటీ నుంచి కొన్ని రోజుల క్రితమే పీహెచ్‌డీ అందుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం బావోజిగూడెం శివార్లలోని భోజ్యతండా ఆయన స్వస్థలం. విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ హాస్టల్‌ చైర్మన్‌గా పనిచేశారు.

మహ్మద్‌ అమీర్‌  కేసీఆర్‌ సేవా దళం రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 49 ఏళ్ల ఆయన.. అడ్వొకేట్‌గా, టీఆర్‌ఎస్‌ నాయకుడిగా సేవలందిస్తున్నారు. పార్టీ నాయకత్వానికి అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది.

సయ్యద్‌ ఖలీలుల్లా ఎంఐఎం కోటాలో ఆర్టీఐ కమిషనర్‌గా చాన్స్‌ దక్కించుకున్నారు. అడ్వొకేట్‌గా పనిచేస్తున్న ఖలీలుల్లా ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ రిక్రూటింగ్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌కు లీగల్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మైనార్టీలు, మహిళా హక్కుల ఉద్యమాల్లో క్రియాశీలంగా పనిచేశారు.