ఆర్టీపీసీఆర్ టెస్టులు టార్గెట్ రీచ్ అవట్లే..

ఆర్టీపీసీఆర్ టెస్టులు టార్గెట్ రీచ్ అవట్లే..

హైదరాబాద్‌‌, వెలుగు:  ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్టుల సంఖ్య పెంచాలని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ మొత్తుకుంటున్నా, రాష్ట్ర సర్కార్‌‌‌‌ పట్టించుకోవట్లేదు. రోజూ చేస్తున్న టెస్టుల్లో 70% ఆర్టీపీసీఆర్‌‌‌‌వే ఉండాలని సూచిస్తున్నా.. మన దగ్గర మాత్రం పది శాతం కూడా దాటట్లేదు. మొన్నటివరకూ అసలు ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయని రాష్ట్ర హెల్త్ డిపార్ట్‌‌మెంట్.. ఇప్పుడు జిల్లాల వారీగా ఆర్టీపీసీఆర్ టెస్టులకు టార్గెట్ పెట్టింది. హైదరాబాద్ సహా 33 జిల్లాల్లో కలిపి రోజూ 7,600 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని సూచించింది. ఈ టార్గెట్‌‌ను కూడా హెల్త్ ఆఫీసర్లు పూర్తి చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఆర్టీపీసీఆర్‌‌‌‌ టెస్టింగ్ కెపాసిటీని సర్కార్ పెంచకపోవడం, శాంపిల్స్‌‌ ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌కు వసతులు లేకపోవడమేనని డాక్టర్లు చెబుతున్నారు. ఉదాహరణకు.. కామారెడ్డి జిల్లాలో రోజూ రెండొందల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని టార్గెట్‌‌ పెట్టారు. ఆ జిల్లాలో సేకరించిన శాంపిల్స్‌‌ను టెస్టింగ్‌‌ కోసం హైదరాబాద్‌‌లోని ఫీవర్‌‌‌‌ హాస్పిటల్‌‌కు పంపించాలని సూచించారు. కానీ, శాంపిల్స్‌‌ను పంపేందుకు వాహనాలు లేకపోవడంతో, వారంలో రెండ్రోజులు మాత్రమే ఆర్టీపీసీఆర్ శాంపిల్స్‌‌ను హైదరాబాద్‌‌కు పంపుతున్నట్టు ఆ జిల్లా అధికారి ఒకరు వెల్లడించారు. వారానికి 1,400 చేయాల్సిన చోట, కేవలం నాలుగొందలు చేస్తున్నట్టు లెక్క.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రోజూ నాలుగైదు వేలకు మించి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం లేదు. ఐసీఎంఆర్ రూల్స్‌‌ ప్రకారం లక్షణాలు ఉండి, యాంటిజెన్‌‌లో నెగెటివ్ వస్తే కచ్చితంగా ఆర్టీపీసీఆర్ చేయాలి. ఇసొంటోళ్లకు కూడా ఆర్టీపీసీఆర్ చేయకపోవడం గమనార్హం.

వందల కిలోమీటర్లకు శాంపిల్స్‌‌

ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే ల్యాబ్​లు ఇప్పటికీ చాలా జిల్లాల్లో లేవు. దీంతో జిల్లాల్లో సేకరించిన శాంపిల్స్‌‌ను సుదూర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. ఉదాహరణకు పెద్దపల్లి జిల్లా శాంపిల్స్‌‌ను హైదరాబాద్‌కు..ఆదిలాబాద్ శాంపిల్స్‌‌ను నిజామాబాద్‌‌కు పంపాలి. ఇలా ఒక్కో జిల్లాలోని శాంపిల్స్‌‌ను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంటర్లకు తరలిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు రిజల్ట్స్​ ఆలస్యంగా, కొన్నిసార్లు రిజల్టే రావడం లేదు. టెస్టులు చేయించుకున్నోళ్లు రిజల్ట్ కోసం మరోసారి టెస్టింగ్ సెంటర్‌‌‌‌కు పోవాల్సిన పరిస్థితి. అక్కడికెళ్లినా సరైన సమాధానం రావడం లేదు. ఈ లోపువారి హెల్త్ పాడవ్వడంతోపాటు, ఇతరులకూ వైరస్ అంటుకునే ప్రమాదముంది.

రోజుకు 4 వేలు చేసే మెషీన్​ ఏది?

ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు రూ.కోట్లు వెచ్చించి, గతేడాది ఓ మెషీన్‌‌ను తెచ్చారు. నిమ్స్‌‌ హాస్పిటల్‌‌లో పోయినేడాది సెప్టెంబర్‌‌‌‌లో మంత్రి ఈటల రాజేందర్​ దీన్ని ప్రారంభించారు. రోజుకు 4 వేల టెస్టులు చేయొచ్చని ప్రకటించారు. కానీ, ఇందులో సగం కెపాసిటీని కూడా దాటడం లేదు. ఇప్పటికీ అక్కడ రోజూ ఆరేడు వందలకు మించి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం లేదు.. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే ప్రభుత్వ ల్యాబ్​లు 20 ఉన్నట్టు బులెటిన్‌‌లో చూపిస్తున్నారు. కానీ, ఇందులో సగం సెంటర్లలో ప్రస్తుతం టెస్టింగ్ కొనసాగుతోంది. కేవలం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులపైనే హెల్త్ ఆఫీసర్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. యాంటిజెన్ టెస్టులు చేయించుకున్నవాళ్లకు కూడా సకాలంలో రిజల్ట్ రావడం లేదు. బల్క్ ఎస్‌‌ఎంఎస్‌‌లపై ట్రాయ్ నిబంధనలతో, టెస్ట్‌‌ చేయించుకున్న వాళ్లకు ఎస్‌‌ఎంఎస్‌‌ వెళ్లడం లేదని ఓ ఆఫీసర్‌‌‌‌ చెప్పుకొచ్చారు. అయితే టెస్ట్ సెంటర్ దగ్గర వెయిట్ చేసేవాళ్లకు, వెంటనే రిజల్ట్ చెబుతున్నామని ఆయన తెలిపారు. సర్కార్‌‌‌‌లో చేయకపోవడంతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల వద్ద ఆర్టీపీసీఆర్‌‌‌‌ కోసం జనాలు క్యూ కడుతున్నారు. టెస్ట్‌‌కు రూ.500 మించి తీసుకోవద్దని ప్రభుత్వం ఇచ్చిన జీవోను ల్యాబ్​ల యాజమాన్యాలు లెక్క చేయడం లేదు. పీపీఈ కిట్ పేరిట, వెయిటింగ్ చార్జ్ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్టు వదిలేస్తుండటం గమనార్హం.