రాహుల్ జీ ప్లీజ్.. త్వరగా పెళ్లి చేసుకోండి: కాంగ్రెస్ అగ్రనేతకు స్వీట్ షాప్ ఓనర్ రిక్వెస్ట్

రాహుల్ జీ ప్లీజ్.. త్వరగా పెళ్లి చేసుకోండి: కాంగ్రెస్ అగ్రనేతకు స్వీట్ షాప్ ఓనర్ రిక్వెస్ట్

న్యూఢిల్లీ: దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పొలిటిషియన్స్‎లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒకరు. ఐదు పదుల వయసు దాటిన పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచి‎లర్‎గానే ఉన్నారాయనా. ఈ క్రమంలో పెళ్లి విషయంలో రాహుల్ గాంధీకి ఓ స్వీట్ షాప్ ఓనర్ ఆసక్తికర విజ్ఞప్తి చేశారు. రాహుల్ జీ ప్లీజ్ త్వరగా పెళ్లి చేసుకోండని కోరారు. మీరు పెళ్లి చేసుకుంటే మా షాపుకు మిఠాయి ఆర్డర్స్ వస్తాయని చమత్కరించారు. 

దీపావళి సందర్భంగా సోమవారం (అక్టోబర్ 20) ఓల్డ్ ఢిల్లీలోని ఐకానిక్ ఘంటేవాలా మిఠాయి షాప్‎కు రాహుల్ గాంధీ వెళ్లారు. ఈ సందర్భంగా స్వీట్ షాప్ యాజమాని, సిబ్బందితో సరదాగా గడుపుతూ వాళ్లతో ముచ్చటించారు. అనంతరం ఇమార్తి, బేసన్ లడ్డూ తయారీని రాహుల్ స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల కోసం స్వీట్లు తీసుకుని వెళ్లిపోయారు రాహుల్. 

ఈ సందర్భంగా.. ఘంటేవాలా మిఠాయి షాప్ యాజమాని సుశాంత్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని భారతదేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అభివర్ణించాడు. అంతేకాకుండా రాహుల్ గాంధీని దయచేసి త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరారని చెప్పారు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే మా షాప్‎కు స్వీట్ ఆర్డర్స్ వస్తాయని.. ఎందుకంటే చాలా కాలంగా గాంధీ కుటుంబానికి మా దుకాణం నుంచి స్వీట్లు అందిస్తున్నామని తెలిపారు.

దివంగత ప్రధాని, రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీకి ఇమార్తి స్వీట్ అంటే ఎంతో ఇష్టమని.. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి చెప్పానని అన్నారు. దీంతో రాహుల్ స్వయంగా ఇమార్తి తయారు చేశారని చెప్పారు. అలాగే.. తనకు ఇష్టమైన బేసన్ లడ్డుల తయారీ విధానాన్ని కూడా రాహుల్ తెలుసుకున్నారని సుశాంత్ మీడియాతో చెప్పారు. 

ఘంటేవాలా మిఠాయి దుకాణానికి వెళ్లిన విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు రాహుల్. 
దీపావళి నిజమైన తీపి 'తాలి'లోనే కాదు.. సంబంధాలు, సమాజంలో కూడా ఉందని అన్నారు. పాత ఢిల్లీలోని ప్రసిద్ధ, చారిత్రాత్మకమైన ఘంటేవాలా స్వీట్ షాపులో ఇమార్తి, బేసన్ లడ్డూ తయారు చేయడానికి ప్రయత్నించానని చెప్పారు.

శతాబ్దాల నాటి ఈ ఐకానిక్ షాపు మాధుర్యం ఇప్పటికీ అలాగే స్వచ్ఛంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. మిఠాయి షాప్ యాజమాని విజ్ఞప్తితో రాహుల్ గాంధీ పెళ్లి ముచ్చట మరోసారి చర్చనీయాంశంగా మారింది.