భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్

భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్

యునైటెడ్ ​నేషన్స్ : యూఎన్​ భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధిగా దౌత్యవేత్త రుచిరా కాంబోజ్(58) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మండలిలో ఈ బాధ్యతలు చేపట్టిన ఇండియా మొదటి మహిళా దౌత్యవేత్తగా ఆమె రికార్డు సృష్టించారు. 1987 ఇండియన్​ ఫారెన్​సర్వీస్ ​బ్యాచ్​కు చెందిన కాంబోజ్​ ఇంతకుముందు భూటాన్​కు ఇండియా దౌత్యవేత్తగా పనిచేశారు. ఈ ఏడాది జూన్​లో మండలిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఆమె నియమితులైనారు. ఇంతకుముందు ఈ స్థానంలో ఉన్న టీఎస్​తిరుమూర్తి పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన స్థానంలో కాంబోజ్​చార్జ్ ​తీసుకున్నారు. రెండేళ్లపాటు ఆమె ఈ పదవిలో ఉంటారు. భద్రతా మండలిలో ఇండియా తరపున బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆమె ట్వీట్​ చేశారు.

ఆమెకు తిరుమూర్తి ట్విటర్​లో అభినందనలు తెలియజేశారు. అలాగే యూఎన్​ మాజీ అసిస్టెంట్ ​సెక్రటరీ జనరల్, యూఎన్​ విమెన్​లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ లక్ష్మీ పూరి కూడా ఆమెకు అభినందనలు తెలిపారు. మండలిలో కాంబోజ్ ​నియామకం ఒక మైలురాయి అని పూరి ట్వీట్​ చేశారు. కాగా పారిస్​లో కాంబోజ్​ తన డిప్లొమాటిక్​ కెరీర్​ను ప్రారంభించారు.1981 నుంచి 1991 దాకా పారిస్​లో భారత దౌత్యవేత్తగా పనిచేశారు. తర్వాత ఢిల్లీకి తిరిగివచ్చి 1991–96 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో అండర్​ సెక్రటరీగా సేవలందించారు. అనంతరం మారిషస్​లో ఎకనామిక్ ​అండ్​ కమర్షియల్​ విభాగంలో ఫస్ట్​ సెక్రటరీగా పనిచేశారు. 2002 నుంచి 2005 మధ్య యూఎన్​లో ఇండియా పర్మనెంట్ ​మిషన్​లో ఆమె కౌన్సెలర్​గా సేవలందించారు. తాజాగా మండలిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎన్​ సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెర్రెస్​తో రుచిర భేటీ అయ్యారు.