బిజినేపల్లి పోలీస్ స్టేషన్లో బాధితులపై దురుసుగా ప్రవర్తించిన ఎస్సై

బిజినేపల్లి పోలీస్ స్టేషన్లో బాధితులపై దురుసుగా ప్రవర్తించిన ఎస్సై
  •     స్టేషన్​పై దాడి చేశారని యువకులపై కేసు నమోదు

కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా బిజినేపల్లి పోలీస్ స్టేషన్​లో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిని తమకు అప్పగించాలంటూ తండావాసులు ఆందోళనకు దిగడం, పోలీసులు వారిని అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.. మీట్యతండా(భీముని తండా)కు చెందిన ఆటో డ్రైవర్​ కిషన్  బిజినేపల్లిలో సెంట్రింగ్  పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా, వెలుగొండ గేట్​ సమీపంలో ఆర్అండ్ బీ ఏఈ సురేందర్  కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిషన్​కు తీవ్రగాయాలవగా, అతడిని నాగర్ కర్నూల్  జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రాజేంద్ర ప్రసాద్, రవి, భాస్కర్, ఉదయ్  తదితరులు బిజినేపల్లి స్టేషన్​కు చేరుకొని ఫిర్యాదు చేశారు. కారు డ్రైవర్ కు వెంటనే డ్రంక్  అండ్  డ్రైవ్  టెస్ట్  నిర్వహించాలని కోరారు. దీంతో ‘మేమేం చేయాలో మీరే చెప్తారా? అంటూ యువకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎస్సై బనీన్, నిక్కర్ పై అక్కడికి వచ్చి బాధితులను బెదిరిస్తూ దాడికి యత్నించాడు. ఫిర్యాదు చేసేందుకు వస్తే దాడి చేస్తారా? అంటూ బాధితులు ప్రశ్నించడంతో గందరగోళం నెలకొంది. 

ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువకులు మద్యం మత్తులో స్టేషన్​కు వచ్చి గందరగోళం సృష్టించారని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని రాజేందర్, రవీందర్, ఉదయ్, భరత్, బాషా, శ్రీను, జింతతో పాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేశారు. డీఎస్పీ శ్రీనివాస్  యాదవ్  మీడియాతో మాట్లాడుతూ సోషల్  మీడియాలో వైరల్​ అవుతున్న కథనాలు అవాస్తవమని తెలిపారు. బిజినేపల్లి ఎస్సై శ్రీనివాస్  డ్యూటీలో భాగంగా యువకులను చెదరగొట్టాడని, దాడికి పాల్పడలేదన్నారు. విధులకు ఆటంకం కలిగించిన యువకులపై కేసు నమోదు చేశామని చెప్పారు.