ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో హెడ్​ కానిస్టేబుల్​ ఆత్మహత్య
చెన్నూర్​/జన్నారం, వెలుగు: హాజీపూర్​మండలం గుడిపేటలోని 13వ బెటాలియన్​లో హెడ్​కానిస్టేబుల్​గా పనిచేస్తున్న బదావత్ ​ప్రకాశ్​నాయక్ (45)​ గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కోటపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్​లో నెల రోజులుగా డ్యూటీ చేస్తున్న ఆయన శనివారం ఉదయం స్టేషన్​లోనే గడ్డిమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రకాశ్​నాయక్​ను పోలీసులు మంచిర్యాల హాస్పిటల్​కు తరలించారు. కండీషన్​ సీరియస్​గా ఉండడంతో కరీంనగర్​లోని అపోలో రీచ్​హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. జన్నారం మండలం మొర్రిగూడకు చెందిన ప్రకాశ్​నాయక్​ 2002లో కానిస్టేబుల్​గా సెలక్టయ్యాడు. ఆయనకు భార్య సుశీల, కూతురు సంధ్య, కొడుకు గణేశ్​ఉన్నారు. సంధ్యకు రెండేండ్ల కిందటే పెండ్లి కాగా, గణేశ్​డిగ్రీ చదువుతున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆర్థిక సమస్యలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కోటపల్లి సీఐ 
విద్యాసాగర్​ తెలిపారు.  
కొత్త సిస్టంతో వేగంగా బొగ్గు రవాణా
మనోజ్​ కె. శ్రీవాత్సవ
నస్పూర్​/రామకృష్ణాపూర్, వెలుగు: శ్రీరాంపూర్​ ఏరియాలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సీహెచ్​పీ, ప్రీవే వ్యాగన్​ లోడింగ్​ సిస్టంతో మరింత వేగంగా బొగ్గు రవాణా చేయొచ్చని రైల్వేబోర్డు- టీటీఎం, ఎన్డీఆర్బీ ప్రిన్సిపల్​ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ మనోజ్​ కె. శ్రీవాత్సవ అన్నారు. శనివారం శ్రీరాంపూర్​ ఏరియాలో రూ.70 కోట్లతో  నిర్మించిన కోల్​ హ్యాండ్లింగ్​ప్లాంట్​, ప్రీవే వ్యాగన్​ లోడింగ్​ సిస్టాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  కొత్త టెక్నాలజీతో రోజుకు 5 రేక్​ల బొగ్గు రవాణా చేసే ఛాన్స్​ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీహెచ్​పీ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకు ముందు మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​లోని సింగరేణి సీహెచ్​పీని సందర్శించారు. సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ట్రాఫిక్ ప్లానింగ్ మేనేజర్ బి. నగ్య,  కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కార్పొరేట్ జీఎం స్వామినాయుడు,  సింగరేణి శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల జీఎంలు బి.సంజీవ్​రెడ్డి, చింతల శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్ల భవిష్యత్​ను కాపాడండి

బాసర, వెలుగు:   ట్రిపుల్​ఐటీ స్టూడెంట్ల భవిష్యత్​ను ఆఫీసర్లు కాపాడాలని పేరెంట్స్​ కమిటీ ప్రెసిడెంట్​రాజేశ్వరి కోరారు. శనివారం బాసర ట్రిపుల్​ఐటీలో డైరెక్టర్ సతీశ్​కుమార్​కు పేరెంట్స్​ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఇటీవల ఇద్దరు స్టూడెంట్లు చనిపోవడం బాధాకరమన్నారు. నలుగురు స్టూడెంట్లపై పెట్టిన కేసులతో వారు జైలులో ఉన్నారని, వారి భవిష్యత్ ఆఫీసర్ల చేతుల్లో ఉందన్నారు.  వారిపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా పీయూసీ-1 రేకుల షెడ్ల విషయంలో రినోవేషన్​ చేయకుండా పక్కా బిల్డింగ్​ కోసం ప్రయత్నం చేయాలని కోరారు. మెస్​ టెండర్లు కూడా వేగంగా పూర్తి చేసి నాణ్యమైన భోజనం అందించాలన్నారు. డైరెక్టర్​ సతీష్​ సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. మాజీ అధ్యక్షుడు కుమారస్వామి ఉన్నారు.
స్టూడెంట్ల​ మృతిపై విచారణ జరపాలి
భైంసా, వెలుగు : బాసర ట్రిపుల్​ఐటీలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్లపై న్యాయ విచారణ జరిపించాలని టీజేఎస్​సెగ్మెంట్​ఇన్​చార్జి సర్దార్ ​వినోద్​ కుమార్​ డిమాండ్​ చేశారు. శనివారం భైంసాలో ఏఎస్పీ కిరణ్​ ఖారేకు వినతి పత్రం అందించారు. బాసర ట్రిపుల్​ఐటీ స్టూడెంట్ల సమస్యలపై ఈ నెల 30న ముథోల్​, బాసరలో అమరదీక్ష చేపడుతామని, అనుమతి ఇవ్వాలని కోరారు. భోజన్న, గంగాధర్​, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ రక్షకులే పాలకులు కావాలి

డీఎస్​పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్
బెల్లంపల్లి, వెలుగు: రాజ్యాంగ రక్షకులే పాలకులు కావాలని దళిత శక్తి ప్రోగ్రాం(డీఎస్​పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. శనివారం రాత్రి  మంచిర్యాల జిల్లా తాండూర్ మీదుగా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం నుంచి, బెల్లంపల్లి పట్టణానికి పాదయాత్ర చేరుకుంది.   ఈ సందర్భంగా  బెల్లంపల్లిలో డీఎస్​పీ జెండా, శిలా పలకం ఆవిష్కరించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో విశారదన్​ మాట్లాడారు. జనాభాలో10 శాతం లేని రెడ్డి, వెలమలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం ఏమిటని  ప్రశ్నించారు. 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు  పాలించాలన్నారు. బహుజన రాజ్యం వస్తే   పేదలకు విద్య, వైద్యం, ఉపాధి లభిస్తుందన్నారు. అగ్రవర్ణ పాలకులు పేద వర్గాలను రాజకీయ చైతన్యం చేయకుండా మోసపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో  బహుజన రాజ్యం నెలకొల్పేందుకు ఈ  స్వరాజ్య పాదయాత్ర చేపట్టామని తెలిపారు.  డీఎస్​పీ రాష్ట్ర  కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా ఇన్ చార్జి వంశీ, జిల్లా కో కన్వీనర్ రామస్వామి, బెల్లంపల్లి ఏరియా నాయకులు శంకర్, రాజు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్​ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు పక్కాగా ఏర్పాట్లు

మంచిర్యాల, వెలుగు:  కానిస్టేబుల్​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ను పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా నోడల్​  ఆఫీసర్​, డీసీపీ అఖిల్​మహాజన్​తెలిపారు. శనివారం ఆయన పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. విధులు నిర్వర్తించే ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు.  సెంటర్ల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. 
 ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి
గణేశ్​నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని డీసీపీ అఖిల్​ మహాజన్​ కోరారు. శనివారం ఆయన గణేశ్​ మండపాల నిర్వాహకులతో మీటింగ్​ నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు చేసే ముందు షెడ్ నిర్మాణం, దాని నాణ్యత, కరెంట్​ సప్లై, వర్షపు నీరు లోపలికి రాకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, టౌన్​ సీఐ నారాయణ, ఉమెన్​ పీస్​ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.  

జిల్లాలో మావోయిస్టుల సంచారం

  వెల్లడించిన ఎస్పీ ప్రవీణ్​కుమార్​
నిర్మల్, వెలుగు : నిర్మల్​ జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని, వారి కోసం ముమ్మరంగా  గాలిస్తున్నామని ఎస్పీ ప్రవీణ్​ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.  పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిఘాను పెంచడమే కాకుండా కూంబింగ్​ ఆపరేషన్ చేపడుతున్నామని వివరించారు. కమ్యూనిటీ పోలీసింగ్​తో  మావోయిస్టుల కదలిక తమకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుందన్నారు. ప్రజలు మావోయిస్టుల సమాచారం తెలిస్తే వెంటనే 100కు ఫోన్​ చేయాలని కోరారు. దీంతో పాటు పోలీసులు ‘సమాచారం మాకు.. బహుమతి మీకు’ అంటూ  మావోయిస్టుల ఫొటోలతో  పోస్టర్లను విడుదల చేశారు. వీరిలో రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు. బండి ప్రకాశ్ అలియాస్​ ప్రభాత్​, మైలారపు అడేల్లు అలియాస్​ భాస్కర్​, కంతి లింగవ్వ అలియాస్​ అనిత వర్గీస్​, పాండు అలియాస్​ మంగులు, కోవ్వాసి రాములు ఉన్నారు. వీరి పేరిటా రూ. 5 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు నగదు బహుమానం ఉందని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచి   నగదు రివార్డు అందిస్తామన్నారు.  కాగా..  కొద్ది రోజుల కింద మైలారపు అడేల్లు అలియాస్​ భాస్కర్​, కంతి లింగవ్వలు సంచరించినట్లు కూడా పోలీసులు అప్పట్లో ధ్రువీకరించారు. మళ్లీ చాలా రోజుల తర్వాత జిల్లాలో వీరి కదలికలు కనిపించినట్లు   పోలీసులు ప్రకటించడం కలకలం రేపుతోంది.

జిల్లాలో అటవీ శాతాన్ని పెంచేందుకు  చర్యలు
    కలెక్టర్ రాహుల్ రాజ్
ఆసిఫాబాద్ ,వెలుగు : జిల్లాలో అటవీ శాతాన్ని పెంచేందుకు  కృషి చేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లాలోని కుమ్రంభీం ప్రాజెక్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ , డీఎఫ్​వో దినేశ్​తో కలసి డ్రోన్ కెమెరాను వినియోగించి వివిధ రకాల పండ్లు, ఇతర మొక్కల విత్తనాలను చల్లారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను పెంచడం ద్వారా  వన్యప్రాణులకు  ఆహారం లభించడంతో పాటు పెరిగిన మొక్కల ద్వారా ఆక్సిజన్​లభిస్తుందని తెలిపారు.

కోర్టు స్థలాన్ని పరిశీలించిన హైకోర్టు జడ్జి
మంచిర్యాల, వెలుగు: నస్పూర్​లో జిల్లా కోర్టు కోసం కేటాయించిన స్థలాన్ని హైకోర్టు జడ్జి వెంకటేశ్వర్​రెడ్డి శనివారం పరిశీలించారు. గతంలో ఐదెకరాలు మాత్రమే ఇచ్చారని, మరో నాలుగు ఎకరాలు కేటాయించాలని కలెక్టర్​ భారతి హోలికేరికి సూచించారు. అనంతరం నస్పూర్​లోని సింగరేణి గెస్ట్​హౌస్​లో జుడీషియల్​  ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. అంతకుముందు దండేపల్లి మండలం గూడెంలోని  సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు.  ఈ సందర్భంగా మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్​, లక్సెట్టిపేట బార్​ అసోసియేషన్ల ప్రతినిధులు పలు సమస్యలపై జడ్జికి వినతిపత్రాలు అందజేశారు. జిల్లా ప్రిన్సిపల్​, సెషన్స్​ జడ్జి బి.సత్తయ్య, జిల్లా అడిషనల్​  జడ్జి జె.మైత్రేయి, ప్రిన్సిపల్​ సీనియర్​ సివిల్​ జడ్జి అర్పిత మారంరెడ్డి, ప్రిన్సిపల్​ జూనియర్​ సివిల్​ జడ్జి జె.మహతి వైష్ణవి తదితరులు 
పాల్గొన్నారు. 

మంచిర్యాల జిల్లా బొగ్గు గనికి  నేషనల్ అవార్డు
 ఆలిండియాలో ఫస్ట్​ ప్లేస్​ దక్కించుకున్న ఆర్కే-1ఏ మైన్​
మందమర్రి, వెలుగు:  జిల్లాలోని మందమర్రి ఏరియా ఆర్కే–1ఏ సింగరేణి బొగ్గు గని నేషనల్​ లెవల్​లో ప్రతిష్ఠాత్మక స్టార్​ రేటింగ్​లో సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా 605 కోల్​మైన్స్​, లిగ్నైట్​మైన్స్​లో  ఆర్కే–1ఏ  వివిధ అంశాల్లో సత్తా చాటి  నేషనల్​ స్టార్​ రేటింగ్​అవార్డు- 2019–-20  దక్కించుకుంది. ఈ మేరకు మందమర్రి ఏరియా సింగరేణి  జీఎం చింతల శ్రీనివాస్, మైన్​మేనేజర్​ శ్రీధర్​రావు శనివారం సంబంధిత వివరాలు వెల్లడించారు. మరోవైపు మొదటిసారిగా ప్రవేశపెట్టి స్టార్​ రేటింగ్​ అవార్డును సింగరేణి నుంచి ఆర్కే–1ఏ గనికి దక్కడంపై సింగరేణి సీఎండీ ఎన్​.శ్రీధర్​, డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

కలెక్టర్​ ముషారఫ్ అలీ ఫారుఖీ
నిర్మల్, వెలుగు:  స్కానింగ్​సెంటర్లలో లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారుఖీ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్​లో ఎస్పీ ప్రవీణ్​ కుమార్​తో కలిసి జిల్లా స్థాయి మీటింగ్​ నిర్వహించారు. జిల్లాలోని స్కానింగ్​సెంటర్లను తనిఖీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. పీసీ, పీఎన్​డీటీ చట్టం ప్రకారం రూల్స్​ పాటించాలని సూచించారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తక్కువగా ఉండడానికి గల కారణాలను తెలుసుకుని  చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు జిల్లా జడ్జి కర్ణ కుమార్​మాట్లాడుతూ.. లింగనిర్ధారణ పరీక్షలు చేసిన వారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా ఉంటుందన్నారు. వారికి సహకరించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50వేల ఫైన్​  విధించడం జరుగుతుందన్నారు. ఈ మీటింగ్ లో అడిషనల్​కలెక్టర్ ​హేమంత్​ బోర్కడే, డీఎంహెచ్ వో  ధన్​రాజ్, అధికారులు పాల్గొన్నారు. 
అర్లి (కే) స్కూల్​ తనిఖీ.. 
జిల్లాలోని నర్సాపూర్​(జీ) మండలంలోని అర్లి (కె) గవర్నమెంట్​ స్కూల్​ను కలెక్టర్​ తనిఖీ చేశారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రజలు, విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారని, ఈ నెల 26 నుంచి 31 వరకు హెల్త్​ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని సిబ్బందిని  ఆదేశించారు. 

భైంసా బంద్​ ప్రశాంతం

స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసిన వ్యాపారులు
భైంసా, వెలుగు : గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ అరెస్టుకు నిరసనగా శనివారం నిర్మల్​ జిల్లా భైంసా బంద్​ ప్రశాంతంగా కొనసాగింది. రాజాసింగ్​అభిమాన సంఘం ఆధ్వర్యంలో  ఒక రోజు ముందే బంద్​  గురించి ప్రచారం చేయడంతో  ఒక వర్గం వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్​లో పాల్గొన్నారు. ఏఎస్పీ కిరణ్​ ఖారే ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా రాజాసింగ్​ హిందూవాహిని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సరికొండ శ్రీనివాస్​, బీజేపీ నాయకులు గాలి రవికుమార్​, రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్ సర్కార్ ఎమ్మెల్యే రాజాసింగ్​పై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడం సరికాదన్నారు. పీడీయాక్టును వెంటనే రద్దు చేసి విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.   కపిల్​శిందే, కోర్వ శ్రీనివాస్​, రాము, ప్రీతమ్​ తదితరులు పాల్గొన్నారు.