
ఎల్బీనగర్, వెలుగు: రన్నింగ్లో మంటలు చెలరేగి గ్రేటర్ పరిధిలో రెండు కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన దంపతులు మన్సూరాబాద్ లో నివాసం ఉంటున్నారు. వ్యక్తిగత పని మీద దంపతులిద్దరూ గురువారం ఉదయం కారులో స్వగ్రామానికి వెళ్లి, తిరిగి మధ్యాహ్నం మన్సూరాబాద్ కు వస్తున్నారు.
హయత్ నగర్ బస్టాండ్ వరకు రాగానే కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగాయి. గమనించిన దంపతులు వెంటనే కారు దిగి పక్కకు వెళ్లగా, మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న హయత్ నగర్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. హైవేపై కారు దగ్ధం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం జరిగిన చాలా సేపటి వరకు కూడా ట్రాఫిక్ పోలీసులు అక్కడ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గండిపేట: ఆరాంఘర్ చౌరస్తాలోని పి.వి. నరసింహారావు ఎక్స్ప్రెస్వే కింద బుధవారం అర్ధరాత్రి మరో కారు దగ్ధమైంది. రన్నింగ్కారులో ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో.. అందులోని నలుగురు వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. కొద్దిసేపట్లోనే కారు మొత్తానికి మంటలు అంటుకొని పూర్తి అగ్నికి ఆహుతైంది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను
ఆర్పివేశారు.