డాలర్తో పోల్చితే 90కి పడిపోయిన రూపాయి.. ధరలపై తీవ్ర ప్రభావం.. పెరిగేవేంటి.. తగ్గేవేంటి..?

డాలర్తో పోల్చితే 90కి పడిపోయిన రూపాయి.. ధరలపై తీవ్ర ప్రభావం.. పెరిగేవేంటి.. తగ్గేవేంటి..?

న్యూఢిల్లీ:  డాలర్ మారకంలో రూపాయి పతనం కొనసాగుతోంది.  ఫారెక్స్ మార్కెట్‌‌లో మంగళవారం మరో 43 పైసలు తగ్గి ఆల్‌‌ టైమ్ కనిష్టమైన  89.96 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 90 వరకు పడింది. ఈ ఏడాది ఆసియాలో  ఎక్కువ విలువ కోల్పోయిన కరెన్సీగా కొనసాగుతోంది. డాలర్‌‌‌‌తో పోలిస్తే ఇతర ఆసియా దేశాల కరెన్సీలు నిలకడగా లేదా కొద్దిపాటి నష్టంతో ట్రేడవుతున్నాయి.  రూపాయి మాత్రం ఈ ఏడాది 4.4 శాతం మేర విలువ కోల్పోయింది.

రూపాయి పడడానికి కారణాలు..డాలర్ బలపడటం..

ఈ ఏడాది రూపాయి పతనానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ బలపడటమే.   అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడంతో, పెట్టుబడులకు ఆకర్షణీయంగా డాలర్ మారింది.  ఫలితంగా, విదేశీ పెట్టుబడులు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి యూఎస్ మార్కెట్లకు మళ్లాయి. భారతదేశం వంటి దేశాల్లో ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌పీఐల) నుంచి పెట్టుబడులు తగ్గిపోయాయి. ఫలితంగా  రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. 

అమెరికాతో వాణిజ్య వివాదాలు.

భారత్–యూఎస్‌‌ మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలు, ట్రేడ్ డీల్ ఆలస్యం రూపాయి స్టెబిలిటీపై ప్రభావం చూపాయి. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోతే రూపాయి విలువ మరింత పడే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.

ఆర్‌‌‌‌బీఐ జోక్యం చేసుకోకపోవడం..

సాధారణంగా రూపాయి విలువ భారీగా పడిపోకుండా ఉండడానికి  ఆర్‌‌‌‌బీఐ  డాలర్లను అమ్మి, రూపాయికి మద్ధతిస్తుంది. కానీ, ఈసారి మన కరెన్సీ పతనాన్ని అడ్డుకునేలా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌‌‌‌బీఐ)  పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఫారెక్స్ నిల్వలను కాపాడడంపైనే ఫోకస్ పెట్టింది. దీంతో  రూపాయి పతనం ఆగడం లేదు. 

పెరిగిన దిగుమతుల ఖర్చు..

ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో  ఇండియా వస్తువుల వాణిజ్య లోటు 87.4 బిలియన్‌‌ డాలర్లకి చేరింది. అంటే, దిగుమతులు ఎగుమతుల కంటే చాలా ఎక్కువగా ఉండటం వల్ల, వీటి చెల్లింపులకు  విదేశీ కరెన్సీపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) పెరిగింది. సీఏడీ అంటే ఒక దేశం జరిపే  విదేశీ ట్రాన్సాక్షన్ల విలువ, తనకొచ్చే ఆదాయం కంటే తక్కువ ఉండడం. దిగుమతులను డాలర్లలో చెల్లించాలి. ఫలితంగా ఇండియా డాలర్లను కొనే కొద్దీ, రూపాయి విలువ పడుతుంది. 

ఇతర కరెన్సీలపైనా ఒత్తిడి..

డాలర్ బలపడటంతో ఇతర దేశాల కరెన్సీలపై కూడా ఒత్తిడి పడుతోంది.  కానీ,  రూపాయిపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంది.  2025లో రూపాయి విలువ 4.4శాతం తగ్గింది. ఇది ఆసియాలో వరెస్ట్ పెర్ఫార్మింగ్ కరెన్సీగా నిలిచింది. చైనా యువాన్, ఇండోనేషియా రూపియా, థాయ్ బాత్ వంటి కరెన్సీలు రూపాయితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. అయితే, జపాన్ యెన్, కొరియన్ వోన్ వంటి నిర్మాణాత్మకంగా బలహీనమైన కరెన్సీలు రూపాయి కంటే మరింత వెనుకబడ్డాయి. అయినా, రూపాయి విలువ వేగంగా పడడంతో  ఆసియాలో అత్యంత బలహీనంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో రూపాయి విలువ డాలర్‌‌‌‌కి  రూ.86.2  వద్ద ఉండగా, డిసెంబర్‌‌‌‌2 నాటికి 90 కి పతనమైంది

రూపాయి తగ్గితే లాభపడేవి..

ఎగుమతిదారులు: ఐటీ, ఫార్మా, టెక్స్‌‌టైల్స్, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ వంటి రంగాలు విదేశాలకు వస్తువులు, సేవలు అమ్ముతాయి. రూపాయి బలహీనమైతే, డాలర్‌‌లో వచ్చే ఆదాయం రూపాయిల్లోకి మారినప్పుడు ఎక్కువ ఆదాయం వస్తుంది.

విదేశీ రెమిటెన్స్ పొందేవారు: గల్ఫ్, అమెరికా, యూరప్‌‌లో పనిచేసే భారతీయులు పంపే డబ్బు,  రూపాయి బలహీనత వల్ల కుటుంబాలకు చేరినప్పుడు ఎక్కువవుతుంది.టూరిజం,  హాస్పిటాలిటీ: విదేశీ పర్యాటకులు భారత్‌‌కి వస్తే, వారి డాలర్ విలువ ఎక్కువ రూపాయిల్లోకి మారుతుంది. ఇది పర్యాటక రంగానికి లాభం.

నష్టపోయేవి...

దిగుమతిదారులు: క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ వంటి దిగుమతులు రూపాయి బలహీనత వల్ల ఖరీదుగా మారతాయి.  దేశీయ వ్యాపారాలపై  భారం పెరుగుతుంది.

సాధారణ వినియోగదారులు: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఎలక్ట్రానిక్స్, గోల్డ్, దిగుమతి వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం  పెరిగే ఛాన్స్ ఉంది.

విదేశీ విద్య, ప్రయాణం: విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ప్రయాణించే వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. డాలర్‌‌లో ఫీజులు, టికెట్లు చెల్లించాలి. దీంతో డాలర్ల కోసం ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.