83కు పడిపోయిన రూపాయి

83కు పడిపోయిన రూపాయి

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరోసారి రికార్డు స్థాయిలో  పతనమైంది. ఇవాళ కరెన్సీ ట్రేడింగ్ లో రూపాయి విలువ 71 పైసలు తగ్గి  83 రూపాయల రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. ఈ ప్రభావంతో అప్పటిదాకా లాభాల బాటలో నడిచిన భారత స్టాక్ మార్కెట్లు.. ఉదయం 11.20 గంటల తర్వాత నష్టాల బాట పట్టాయి.  ఉదయం 10.39 గంటల సమయానికి 59,377 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్.. ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి దాదాపు 270 పాయింట్లు కోల్పోయి 59,107 పాయింట్లకు చేరింది. ఉదయం ట్రేడింగ్ సెషన్ లో ఒకానొక దశలో 17,601 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరిన  నిఫ్టీ.. క్రమంగా తగ్గుతూ వచ్చి మధ్యాహ్నం 3 గంటల సమయానికి దాదాపు 105 పాయింట్లను కోల్పోయి 17,496కి పడిపోయింది. చివర్లో కొంత కోలుకొని 17,512 పాయింట్ల వద్ద ముగిసింది. 

రూపాయిలో ఇప్పుడు ఎందుకింత బలహీనత చోటుచేసుకుందంటే.. ప్రపంచంలోని ఇతర కరెన్సీల కంటే ప్రస్తుతం డాలరు బలహీనంగా ఉంది. బ్రిటన్ లో సెప్టెంబరు నెల ద్రవ్యోల్బణం రేటు 40 ఏళ్ల (1982 నాటి)  గరిష్ఠ స్థాయికి (10.1 శాతం)  చేరడం కూడా డాలరును మరింత బలోపేతం చేసింది. ద్రవ్యోల్బణ మంటల కారణంగా బ్రిటన్ లో ఆహార ఉత్పత్తుల ధరలు కిందటి ఏడాదితో పోలిస్తే దాదాపు 14.5 శాతం పెరిగాయి. ఇవి ఇంత భారీగా పెరగడం 1980 తర్వాత ఇదే తొలిసారి అని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ద్రవ్యోల్బణం రేటును 2 శాతానికి మించకుండా చేసే లక్ష్యంతో  బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.   బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ దాదాపు 0.6 శాతం పడిపోయింది. ఇక జపాన్ కరెన్సీ యెన్ తో పోలిస్తే డాలరు 32 ఏళ్ల గరిష్ఠానికి బలపడింది.