- గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తాం
- వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నాగర్‌కర్నూల్, వెలుగు : మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో అధునాతన సదుపాయాలతో కూడిన క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా మెడికల్ కాలేజీలో రూ.23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. తెలకపల్లి మండల కేంద్రంలో రూ.1.59 కోట్లతో నిర్మించిన పీహెచ్‌సీని సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజలు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే చికిత్స అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 35 మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. హాస్టళ్లు, లైబ్రరీలు, ల్యాబొరేటరీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో అవసరమైన వసతుల కోసం రూ.2.65 కోట్లు అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, కమిషనర్ సృజన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్‌నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పాల్గొన్నారు.
మెడికల్ హబ్‌గా పాలమూరు..
మహబూబ్‌నగర్ అర్బన్: మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను సూపర్ స్పెషాలిటీ మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం పాలమూరులో పర్యటించిన ఆయన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో నిర్వహించిన స్వచ్చంద రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మెడికల్ కాలేజీలో సీట్ల పెంపు, పీజీ కోర్సుల విస్తరణ, విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు, ఆడిటోరియం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
