తెలంగాణ గ్రామీణ యువతకు స్కిల్స్ లేవు : వినోద్ కుమార్

తెలంగాణ గ్రామీణ యువతకు స్కిల్స్ లేవు  : వినోద్ కుమార్
  •  అందుకే హైదరాబాద్​లో ఇతర రాష్ట్రాల వాళ్లు పనిచేస్తున్నరు 

కరీంనగర్, వెలుగు: తెలంగాణ గ్రామీణ యువతకు స్కిల్స్ లేవని.. అందుకే హైదరాబాద్​లో ఇతర రాష్ట్రాల‌‌‌‌కు చెందిన 30 లక్షల మంది యువకులు పని చేస్తున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. వాళ్లకు స్కిల్స్ ఉన్నాయని, అందుకే వారిని ఎంగేజ్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఆయన మార్నింగ్ వాక్​లో చేశారు. వినోద్ మాట్లాడుతూ.. మన యువతకు కమ్యూనికేషన్, ఇతర  స్కిల్స్ నేర్పించాలన్నారు.

 తనను గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి రూ.1‌‌‌‌‌‌‌‌00 కోట్లతో యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. తాను ఎంపీగా గెలిచాక కరీంనగర్ నుంచి హైదరాబాద్​కు నేరుగా రైలులో వెళ్లేందుకు కొత్త రైల్వే లైన్ మంజూరు చేయించానని తెలిపారు. స్మార్ట్ సిటీ కోసం వెయ్యి కోట్లు తీసుకొచ్చానని చెప్పారు. జాతీయ పార్టీల ఎంపీలతోని ఒక్క పని కాలేదన్నారు.

 మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఆగిపోయి బోసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ బ్రిడ్జి మెయింటనెన్స్ సరిగ్గా లేదన్నారు. మరోవైపు, తాను గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంజయ్ అంటున్నాడని.. తాను గెలవడం, సంజయ్ సన్యాసం తీసుకోవడం తథ్యమని వినోద్​ అన్నారు.