- మృతుల్లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు
మాస్కో: ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా మిలట రీ విమానం(ఐఎల్---76) కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 74 మంది చనిపోయారు. మృతుల్లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, ఆరుగురు ప్లైన్ సిబ్బంది, మరో ముగ్గురు ప్యాసింజర్లు ఉన్నారు. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గొరోడ్లో బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుప్పకూలడానికి ముందు విమానం అదుపుతప్పి వేగంగా కిందికి పడిపోతున్నట్లు వీడియోలో కనిపించింది. తర్వాత ఇది నివాస ప్రాంతాల వద్ద నేలను తాకింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ పనులు చేపట్టారు. ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ ఖైదీలను బెల్గొరోడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. ఆ విమానాన్ని తమ రక్షణ బలగాలే కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మీడియా కథనాలు వెల్లడించాయి. అందులో రష్యా క్షిపణులను తరలిస్తోందని, యుద్ధ ఖైదీలను కాదని వివరించాయి. కానీ, రష్యా మాత్రం అందులో ఉన్నది యుద్ధ ఖైదీలేనని చెప్తోంది. ఐఎల్-76లో బలగాలను, సరకులను, సైనిక పరికరాలను తరలించే వీలుంది.
