యుద్ధంలో ఆకలి కూడా రష్యా ఆయుధమే

యుద్ధంలో ఆకలి కూడా రష్యా ఆయుధమే
  • రైతుల పొలాలను, పనిముట్లనూ ధ్వంసం చేస్తోంది
  • ఎగుమతులకు వీల్లేకుండా పోర్టులు బ్లాక్ చేసింది 
  • పేదదేశాలకు ఆకలి ముప్పొస్తుందని ఆవేదన 
  • ఐర్లాండ్ పార్లమెంట్ ను ఉద్దేశించి జెలెన్ స్కీ స్పీచ్

కీవ్: ఉక్రెయిన్ లో ని పంట పొలాలను సైతం రష్యా ధ్వంసం చేస్తోందని, చివరకు ఆకలిని కూడా ఒక ఆయుధంగా మలచుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. బుధవారం ఐర్లాండ్​ పార్లమెంట్​నుద్దేశించి ఆయన మాట్లాడారు. రైతుల పంట పొలాలు, వ్యవసాయ పనిముట్లను రష్యా బలగాలు ధ్వంసం చేస్తున్నాయని, ఉక్రెయిన్ రేవుల నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆకలిని కూడా వాళ్లు ఆయుధంగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచంలో వ్యవసాయం ఎక్కువగా చేసే దేశాల్లో ఉక్రెయిన్​ కూడా ఒకటి. ఎగుమతులకు రష్యా అడ్డంకులు సృష్టించడం వల్ల ఆసియా, ఆఫ్రికాల్లోని చాలా పేద దేశాలకు తిండి గింజలు అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా దేశాల్లో తిండికి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. ఆకలి కేకలు పెరిగే ప్రమాదముంది’’ అని జెలెన్​స్కీ అన్నారు. మానవతా కోణంలో వివిధ దేశాలు పంపిస్తున్న సాయాన్ని రష్యా అడ్డుకుంటోందని, సముద్రం, నేలను మొత్తం గుప్పిట్లో పెట్టుకుందన్నారు. తిండి, నీళ్లు, మందులు సహా అన్నింటినీ అడ్డుకుంటోందని చెప్పారు. రష్యాపై ఈయూ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలన్నారు. యుద్ధం వల్ల మారారని,167 మంది పిల్లలు చనిపోయారని చెప్పారు.  

ఉక్రెయిన్ జెండాను ముద్దాడిన పోప్​ 

బూచాలో రష్యా సృష్టించిన మారణ హోమంపై పోప్​ ఫ్రాన్సిస్ ​ఆవేదన వ్యక్తం చేశారు. వాటికన్​ సిటీ ఆడిటోరియంలో వీక్లీ ప్రసంగం సందర్భంగా ఆయన.. ఉక్రెయిన్​ జాతీయ జెండాను ముద్దాడారు. ఉక్రెయిన్​లో ఇటీవలి పరిణామాలు కలచివేస్తున్నాయన్నారు. మహిళలు, పిల్లలపైనా అరాచకాలకు పాల్పడడం దారుణమన్నారు. గతంలో బూచా ప్రజలే తనకు ఈ జాతీయ జెండాను పంపించారని చెప్పిన ఆయన.. దానిని ఎగరేశారు.

ఈస్ట్​, సౌత్ ఉక్రెయిన్​పై దాడులు 

ఇన్నాళ్లూ పశ్చిమ ఉక్రెయిన్​పై తీవ్ర దాడులు చేసిన రష్యా ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్​పై పట్టు సాధించేందుకు దాడులను మరింత తీవ్రం చేసింది. లుహాన్స్క్, డాన్బాస్, డొనెట్స్క్​తో పాటు ఇతర ప్రాంతాలపై ఎయిర్​స్ట్రైక్స్​కు పాల్పడుతోంది. మరియుపోల్​లో మానవతా సంక్షోభం తీవ్రంగా ఉందని, రష్యా దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆ సిటీ మేయర్​ వాదిమ్​ బోయ్చెంకో ఆవేదన వ్యక్తం చేశారు. 

రష్యాలో 'చానల్' హ్యాండ్ బ్యాగ్స్ చించేస్తున్రు

రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ఆ దేశంలో తమ బ్యాగులు వాడొద్దని చెప్పిన ఫ్రెంచ్ కంపెనీ ‘చానెల్’కు రష్యన్ మహిళలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచిన ఖరీదైన చానెల్ బ్రాండ్ బ్యాగ్ లను కట్ చేసి, చించేస్తూ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  రష్యాకు చెందిన సెలెబ్రిటీ మహిళలు ఖరీదైన 'చానల్' బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్ కట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 'మాకు, మా దేశ గౌరవానికి మించి ఏ బ్రాండు ఎక్కువ కాదు' అని చెప్తున్నారు. 

పుతిన్ బిడ్డలపై ఈయూ ఆంక్షలు 

రష్యాపై అన్ని రకాల ఆంక్షలు విధిస్తున్న పశ్చిమ, యూరప్​ దేశాలు.. మరో అడుగు ముందుకేశాయి. ఇప్పటికే రష్యా ప్రముఖులు, రాజకీయ నాయకులు, డిప్లమాట్లు, వ్యాపారవేత్తలపై ఆంక్షలు విధించిన ఈయూ దేశాలు.. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కూతుళ్లపైనా ఆంక్షలు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. సైనికులను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన రష్యా.. బూచా సిటీలో ఊచకోతలకు పాల్పడడంపై మండిపడుతున్న ఈయూ దేశాలు.. ఈ మేరకు కేటరీనా, మరియా వోరోనోత్సవాలను ఆంక్షల జాబితాలో చేర్చేందుకు చర్చిస్తున్నాయని తెలుస్తోంది. మరోవైపు 12 మంది రష్యన్ డిప్లమాట్​లను గ్రీక్ బహిష్కరించింది.