మరియుపోల్ సిటీనిపూర్తిగా స్వాధీనం చేసుకున్నాం

మరియుపోల్ సిటీనిపూర్తిగా స్వాధీనం చేసుకున్నాం

కీవ్/మాస్కో: దక్షిణ ఉక్రెయిన్​లోని మరియుపోల్ సిటీని 3 నెలల పోరాటం తర్వాత పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని శనివారం రష్యన్ ఆర్మీ ప్రకటించింది. సిటీలోని అజోవ్​స్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి శుక్రవారం మరో 500 మంది ఉక్రెయిన్ ఫైటర్లు లొంగిపోయారని, దీంతో ప్లాంట్ అంతా ఖాళీ అయిందని వెల్లడించింది. ప్లాంట్ నుంచి మొత్తం 2,439 మంది ఫైటర్లు లొంగిపోయారని, వీరిలో గాయపడినవాళ్లను ఆస్పత్రులకు, మిగతా వాళ్లను రష్యన్ ఆర్మీ అధీనంలోని ప్రాంతాలకు తరలించినట్లు ‘ఆర్ఐఏ నొవొస్తి’ మీడియా సంస్థ వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ వద్ద ఆపరేషన్ ముగియడంతో సిటీని మొత్తం విముక్తి చేశామంటూ రష్యా ప్రెసిడెంట్ పుతిన్​కు రక్షణ మంత్రి సెర్గీ షోయిగు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిపింది. అలాగే పశ్చిమదేశాలు ఉక్రెయిన్ కు పంపిన లార్జ్ బ్యాచ్ ఆయుధాలు, ఎక్విప్ మెంట్​ను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. కాగా, తమ దేశంలో వేసిన ప్రతి బాంబుకూ రష్యా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అన్నారు. రష్యా దండయాత్రతో తమకు 100 బిలియన్ డాలర్ల నష్టం ( రూ.7.78 లక్షల కోట్లు) జరిగిందని, ఆ మొత్తం రష్యా నష్టపరిహారంగా చెల్లించాలన్నారు. 

అపెక్ మీటింగ్​లో రష్యాకు ఝలక్ 

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్​లో శనివారం ఆసియా–పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్(అపెక్) దేశాల వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా రష్యాకు పశ్చిమ దేశాలు ఝలక్ ఇచ్చాయి. సమావేశంలో రష్యన్ మంత్రి స్పీచ్ మొదలుపెట్టగానే.. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, కెనడా, జపాన్ దేశాల వాణిజ్య మంత్రులు వాకౌట్ చేశారు.

రష్యా ఏరోస్పేస్ సంస్థ వద్ద మంటలు

రష్యాలో రక్షణ శాఖకు చెందిన మరో సంస్థలో మంటలు చెలరేగాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటికే12కుపైగా మిలిటరీ ఆఫీసులు, ఫ్యాక్టరీలు, సంస్థల వద్ద అగ్నిప్రమాదాలు జరగగా.. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కావాలనే కొందరు విధ్వంసానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా శనివారం ఝుకోవ్ స్కీలో రష్యన్ ఫైటర్ జెట్లు, రాకెట్లను అభివృద్ధిచేసే ఏరోహైడ్రోడైనమిక్ ఇనిస్టిట్యూట్ వద్ద మంటలు రేగాయి. ఇనిస్టిట్యూట్ కు పవర్​ను సప్లై చేసే సబ్ స్టేషన్ పేలిపోగా.. భారీ ఎత్తున మంటలు, పొగ వెలువడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి