
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నాలుగో రోజు భీకరంగా కొనసాగుతోంది. రాజధాని నగరం కీవ్ లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని గ్యాస్, చమురు నిక్షేపాలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో పలు నగరాల్లో భారీ పేలుళ్ల మోతమోగుతోంది. తాజాగా మరో రెండు పెద్ద నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దక్షిణ, ఆగ్నేయ ఉక్రెయిన్ ప్రాంతాల్లో ఉన్న రెండు పెద్ద సిటీలను తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రష్యా ప్రకటించుకుంది. ఇక ఎటు చూసినా బాంబుల మోతలు..సైరన్లతో కీవ్ నగరం అట్టుడుకుతోంది. భయంతో జనం బంకర్లు, సెల్లార్లలో తలదాచుకుంటున్నారు. కీవ్ నగరంపై పట్టు కోసం రష్యన్ బలగాలు ప్రయత్నిస్తుంటే.. దాన్ని ఉక్రెయిన్ సేన అంతే తీవ్రంగా తిప్పికొడుతోంది.
Russia claims to have besieged two big cities in south and southeast of Ukraine: AFP News Agency#RussiaUkraineConflict
— ANI (@ANI) February 27, 2022
ఉదయం కార్కివ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా.. గ్యాస్ పైల్ లైన్ ను పేల్చేశాయి. దీంతో ఆకాశంలో దట్టమైన పొగ ఏర్పడింది. ఎన్ని ప్రాంతాలు రష్యా చేతికి చిక్కాయన్న సమాచారంపై స్పష్టత కొరవడింది. పలు చోట్ల రష్యా బలగాలను తిప్పికొట్టామని, రాజధానికి సమీపంలో మాత్రం హోరాహోరీగా పోరు కొనసాగుతోందని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. రష్యా దురాక్రమణను తట్టుకుని నిలుస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. పారాట్రూపర్లతో వెళ్తున్న రష్యా రవాణా విమానాన్ని కూల్చివేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అయితే మరోవైపు ఇప్పటికీ తాము చర్చలకు సిద్ధమేనని రష్యా ప్రకటిస్తున్నట్లు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీ తెలిపింది.
Kremlin says ready for talks with Ukraine in Belarus: AFP News Agency #RussiaUkraineConflict
— ANI (@ANI) February 27, 2022