అది భారత్ హక్కు.. వద్దని చెప్పడానికి మీరేవరూ..? ట్రంప్ బెదిరింపులపై రష్యా సీరియస్

అది భారత్ హక్కు.. వద్దని చెప్పడానికి మీరేవరూ..? ట్రంప్ బెదిరింపులపై రష్యా సీరియస్

మాస్కో: రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తే భారత్‎పై మరిన్ని సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులపై రష్యా సీరియస్ అయ్యింది. ఏ దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలనేది సార్వభౌమ దేశామైన ఇండియా ఇష్టమని.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారత్‎ను బెదిరించడానికి ట్రంప్ ఎవరని మండిపడింది. రష్యా నుంచి చమురు కొంటే భారత్‎పై మరిన్ని సుంకాలు విధిస్తామనే అమెరికా బెదిరింపులను చట్టవిరుద్ధమని కొట్టిపారేసింది రష్యా. 

ఉక్రెయిన్‎తో మూడేళ్లుగా యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులను పట్టించుకోని భారత్.. రష్యా నుంచి అలాగే చమురు దిగుమతి చేసుకుంటోంది. తమ మాట వినని ఇండియాపై కోపం పెంచుకున్న ట్రంప్.. అమెరికాలో భారత దిగుమతులపై 25 శాతం వాణిజ్య సుంకాలు విధించాడు. అమెరికా 25 శాతం ట్రేడ్ టారిఫ్స్ విధించడంతో తలొగ్గిన భారత్.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేసిందని ప్రచారం జరిగింది. 

ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి యధావిధిగా చమురు దిగుమతి చేసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ట్రంప్.. ఇప్పటికే విధించిన 25 శాతం కాకుండా భారత్‎పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించాడు. ట్రంప్ ఇండియాను బెదిరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది రష్యా. ట్రంప్ బెదిరింపులకు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కౌంటర్ ఇచ్చారు. 

రష్యాతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని ప్రపంచదేశాలను అమెరికా బెదిరిస్తోందనే చాలా ప్రకటనలు మేం చూస్తున్నాం. అలాంటి ప్రకటనలను చట్టబద్ధమైనవిగా మేము పరిగణించం’’ అని స్పష్టం చేశారు డిమిత్రి పెస్కోవ్. సార్వభౌమ దేశాలు దేశ ప్రజయోనాల దృష్ట్యా వాణిజ్యం, ఆర్థిక సహకారం కోసం తమ సొంత వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కును కలిగి ఉండాలని.. మేం కూడా దీనినే విశ్వసిస్తామని అన్నారు. మాస్కోతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని భారతదేశంపై అమెరికా ఒత్తిడి తీసుకురావడం చట్టవిరుద్ధమన్నారు.