కొన్ని రష్యా బలగాలు వెనక్కి!

కొన్ని రష్యా బలగాలు వెనక్కి!
  • బేస్‌‌‌‌లకు పిలిపించినట్లు కీలక ప్రకటన
  • ఎక్కడి నుంచి, ఎంత మంది వెనక్కి వస్తున్నరో చెప్పలే
  • స్వయంగా చూసే దాకా తాము నమ్మబోమన్న ఉక్రెయిన్
  • దాడి జరిగే ప్రమాదం ఉందన్న అమెరికా, ఈయూ దేశాలు


మాస్కో: ఉక్రెయిన్‌‌‌‌తో యుద్ధ వాతావరణం, నాటో దేశాలతో గొడవలు కొనసాగుతున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. దౌత్య చర్చలు జరుగుతుండగానే కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్న కొన్ని ట్రూపులను వెనక్కి పిలిపించినట్లు మంగళవారం ప్రకటించింది. కొన్ని బలగాలు తమ సైనిక కసరత్తులను పూర్తి చేశాయని, అవి బేస్‌‌‌‌లకు రావడం మొదలవుతుందని చెప్పింది. ఉక్రెయిన్ సంక్షోభానికి దారితీసిన భద్రతా సమస్యల గురించి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి కామెంట్ చేసిన తర్వాతి రోజే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఉక్రెయిన్‌‌‌‌ సరిహద్దుల నుంచి బలగాల ఉపసంహరణ గురించి మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. మరోవైపు ఎక్కడ మోహరించిన ట్రూప్స్‌‌‌‌ను వెనక్కి రప్పిస్తారన్నది కూడా రష్యా స్పష్టంగా చెప్పలేదు. ఎప్పుడు, ఎంత మంది రిటర్న్ అవుతారనే దానిపైనా క్లారిటీ రాలేదు. దీంతో రష్యా మాటలపై ఉక్రెయిన్, వెస్ట్రన్ దేశాలు 
అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

మాకు నమ్మకం లేదు.. ఉక్రెయిన్​

వెస్ట్రన్ దేశాలు మాత్రం రష్యా మాటలను నమ్మడం లేదు. ఏ సమయంలోనైనా దాడి జరగొచ్చని అమెరికా, యూరోపియన్ దేశాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. మిలటరీ హార్డ్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌తోపాటు కొన్ని బలగాలు సరిహద్దుల వైపు కదులుతున్నాయని చెబుతున్నాయి. ‘‘రష్యా ఎప్పుడూ ఏవో ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. అందుకే మేం ఒక రూల్‌‌‌‌ను ఫాలో అవుతం. ‘విన్నప్పుడు’ మేం నమ్మం. కేవలం ‘కనిపించినప్పుడు’ మాత్రమే నమ్ముతాం. దళాలు వెనక్కి వెళ్లిపోతున్నది చూసినప్పుడు.. సరిహద్దుల్లో టెన్షన్స్ తగ్గుతున్నట్లు మేం నమ్ముతాం’’ అని ఉక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ దిమిత్రో 
కులేబా కామెంట్ చేశారు.

చర్చల మీద చర్చలు

యుద్ధాన్ని ఎలాగైనా నివారించేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దౌత్యం ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాము చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా చెప్పగా.. అమెరికా కూడా సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగానే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌‌‌‌తో మాస్కోలో సమావేశం కావాలని జర్మనీ చాన్స్‌‌‌‌లర్ ఒలఫ్ స్కోల్జ్‌‌‌‌ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఉక్రెయిన్ లీడర్‌‌‌‌ ఒలోదిమిర్ జెలెన్‌‌‌‌స్కీతో కీవ్‌‌‌‌లో భేటీ అయ్యారు. మరోవైపు రష్యాను తీవ్రంగా విమర్శించే పోలాండ్‌‌‌‌ కూడా రంగంలోకి దిగింది. రష్యా విదేశాంగ మంత్రి సర్జేయ్ విక్టొరో‌‌‌‌విచ్ లవ్‌‌‌‌రోవ్‌‌‌‌తో భేటీ అయ్యేందుకు పోలాండ్ ఫారిన్ మినిస్టర్ బింగ్‌‌‌‌న్యూ రవ్.. మంగళవారం మాస్కోకు వచ్చారు. ఇక కీవ్‌‌‌‌లో ఉక్రెయిన్, ఇటలీ ఫారిన్ మినిస్టర్లు చర్చలు జరిపారు.

మిలటరీ యాక్టివిటీలు పెంచుతూనే..!

దాదాపు లక్షా 30 వేల మంది సోల్జర్లను ఉక్రెయిన్‌‌‌‌కు దగ్గర్లో రష్యా మోహరించింది. నార్త్, సౌత్, ఈస్ట్.. మూడు వైపులా చుట్టుముట్టింది. సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. కానీ ఉక్రెయిన్‌‌‌‌ను ఆక్రమించుకునే ఉద్దేశం తమకు లేదని చెబుతూ వస్తున్నది. బెలారస్, క్రిమియా, వెస్ట్రన్ రష్యాలో మిలటరీ యాక్టివిటీలను రష్యా పెంచుతున్నట్లు శాటిలైట్ ఇమేజరీ కంపెనీ మాక్సర్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఫార్వర్డ్ లొకేషన్లలోకి హెలికాప్టర్లు, గ్రౌండ్ అటాక్ ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్టులు, ఫైటర్ బాంబర్ జెట్లు వస్తున్నట్లు పేర్కొంది. 48 గంటల వ్యవధిలో తీసిన ఫోటోల ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.

అట్లేం అనిపిస్తలే: నాటో చీఫ్

కొన్ని ట్రూప్స్‌‌‌‌ను వెనక్కి పిలిపించినట్లు రష్యా చేసిన ప్రకటనపై నాటో సెక్రటరీ జనరల్ జెన్స్‌‌‌‌ స్టోల్టెన్‌‌‌‌బెర్గ్ స్పందించారు. బ్రస్సెల్స్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ బార్డర్‌‌‌‌‌‌‌‌లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు సంబంధించి రష్యా వైపు నుంచి మాకు ఎలాంటి సానుకూల చర్యలు కనిపించలేదు. కానీ దౌత్య ప్రయత్నాల గురించి మాస్కో నుంచి మాకు సంకేతాలు వస్తున్నాయి అని చెప్పారు. 

మనోళ్లంతా వచ్చేయండి: కేంద్రం

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌‌‌‌లో చదువుకుంటున్న స్టూడెంట్లు, అక్కడ ఉండాల్సిన అవసరం పెద్దగా లేని వారు తాత్కాలికంగా ఇండియాకు వచ్చేయాలని సూచించింది. అలాగే ఉక్రెయిన్ వెళ్లే వాళ్లు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరింది. మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌లోని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్‌‌‌‌లో ఉన్న భారతీయులు తమ సమాచారాన్ని ఎంబసీలో అందజేయాలని కోరింది. ఆ జాబితా ఆధారంగా ఇండియన్స్‌‌‌‌కు తగిన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం

స్టైలిష్ లుక్‎లో దినసరి కూలి.. ఫోటోలు వైరల్

జగన్ తో అలీ భేటీ.. త్వరలో కీలక ప్రకటన