జర్మనీకి గ్యాస్​ సరఫరా చేసే పైప్​ లైన్​ ను మూసివేసిన రష్యా 

జర్మనీకి గ్యాస్​ సరఫరా చేసే పైప్​ లైన్​ ను మూసివేసిన రష్యా 

జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే కీలకమైన పైప్ లైన్ ను రష్యా మూసివేసింది. దీంతో యూరప్ లో సోమవారం ఉదయం ట్రేడింగ్ లో గ్యాస్ ధరలు 30 శాతం పెరిగాయి. జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే పైప్ లైన్ ను మూడు రోజులు మూసివేసి శనివారం తెరిచారు. కానీ, ఈ పైప్ లైన్ లో లీకు ఉందని గ్యాజ్ ప్రోమ్ సంస్థ ప్రకటించడం ఐరోపా సమాఖ్య దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రష్యా గ్యాస్ తో బ్లాక్ మెయిల్ చేస్తోందని ఐరోపా సమాఖ్య( ఈయూ) దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ వార్తను రష్యా ఖండించింది. 

హోల్ సేల్ గ్యాస్ ధరలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. జర్మనీ తమ నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయని ప్రకటించడంతో ధరలు పతనమయ్యాయి. కానీ, ఐరోపాకు సరఫరాలు తగ్గించాలని క్రెమ్లిన్  నిర్ణయించడంతో హోల్ సేల్  గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్క యూకేలోనే ఈ పెరుగుదల 35 శాతం వరకు ఉంది.

శీతాకాలం దగ్గరకొచ్చే కొద్దీ రష్యా చమురును ఆయుధంగా వాడి పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. బయటకు మాత్రం నార్డ్ స్ట్రీమ్  1 పైప్  లైన్ లోని ఒక టర్బైన్ లో లీకులే కారణమని చెబుతోంది. కానీ, జర్మనీకి చెందిన సీమన్స్ సంస్థ దీన్ని కొట్టిపారేసింది. అలాంటి లీకులు పైప్ లైన్  పని తీరుపై ప్రభావం చూపవని తెలిపింది. ఇప్పటికే యూరప్ దేశాలు చమురుపై ధర నియంత్రణ ప్రకటించాయి. కానీ, ఈ ఒప్పందంలో భాగమైన దేశాలకు చమురు ఎగమతి చేయమని రష్యా తేల్చి చెప్పింది.