ఉక్రెయిన్పై క్షిపణుల వర్షం.. 10 మంది మృతి

ఉక్రెయిన్పై క్షిపణుల వర్షం.. 10 మంది మృతి

ఉక్రెయిన్ పై వైమానిక దాడులను రష్యా మరింత ఉధృతం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇవాళ ఉదయం దాదాపు 75 క్షిపణులు ఒకదాని తర్వాత ఒకటిగా కీవ్ నగరాన్ని కుదిపేశాయి. దీంతో నగరంలో ఎక్కడ చూసినా పేలుళ్ల శబ్దాలు, ప్రజల హాహాకారాలు, సైరన్లు, అంబులెన్స్ ల మోతలు  వినిపించాయి. పొగలు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. నగరంలోని పలుచోట్ల దాదాపు పది మంది మృతిచెందగా, 50 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈనేపథ్యంలో కీవ్ నగరంలోని చాలామంది ప్రజలు అండర్ గ్రౌండ్ టన్నెళ్లలో తల దాచుకున్నారు. ఇంకొంత మంది ఇరుగుపొరుగు నగరాలకు వలస వెళ్లిపోయారు. కీవ్ నగరం నడిబొడ్డున ఉండే షెవ్ చెన్కివ్ స్కి ప్రాంతంలో క్షిపణులు పెద్ద సంఖ్యలో పడినట్లు స్థానిక జర్నలిస్టులు గుర్తించారు. ఈవిషయాన్ని కీవ్ నగర మేయర్ విటాలీ క్లిట్ షికో సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు.

రష్యా క్షిపణి దాడులు ప్రధానంగా కీవ్ నగరంలోని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు లక్ష్యంగా జరిగాయని తెలిపారు. అంతకుముందు చివరిసారిగా జూన్ 26న కీవ్ నగరంపై రష్యా దాడికి పాల్పడింది. మూడున్నర నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ నగరాన్ని రష్యా టార్గెట్ గా చేసుకుంది. తమ దేశాన్ని క్రిమియా ద్వీపకల్పంతో అనుసంధానం చేసే కెర్చ్ రైలు, రోడ్డు  వంతెన పై అక్టోబరు 8న జరిగిన పేలుడుకు ఉక్రెయినే కారణమని రష్యా భావిస్తోంది. క్రిమియా వంతెనపై పేలుడును ఉగ్రవాద చర్యగా ప్రకటించిన రష్యా.. అందుకు ప్రతీకారంగానే ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా క్షిపణి దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అక్టోబరు 8న ఏం జరిగింది ? 

క్రిమియా ప్రాంతాన్ని ఉక్రెయిన్ నుంచి రష్యా 2014  సంవత్సరంలో ఆక్రమించుకుంది. క్రిమియాను రష్యాతో అనుసంధానించడంలో ‘కెర్చ్ రైలు, రోడ్డు వంతెన’ ఎంతో కీలకమైంది. అక్టోబరు 8న (శనివారం) ఈ వంతెనపై 19వ కిలోమీటర్ ప్రాంతం వద్ద ఓ ట్రక్కు అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో క్రిమియా వైపు వెళ్తున్న 7 ఆయిల్ ట్యాంకర్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ధాటికి వంతెనలోని కొంత భాగం కూలి సముద్రంలో పడిపోయింది. ఈ వంతెనపై పేలుడును రష్యా ఖండించింది. దాన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేసింది. ఆ వంతెన రక్షణ బాధ్యతలను ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్  కు అప్పజెపుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు.  

ఉక్రెయినే ఉసిగొల్పిందని వెల్లడవడంతో..

అసలు ఎవరు ఈ చర్యకు పాల్పడ్డారన్నది తెలుసుకోవడానికి రష్యా ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఛైర్మన్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. అది ఉక్రెయిన్ ఉసిగొల్పిన ఉగ్రవాదుల పనేనని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు దర్యాప్తు కమిటీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ నివేదిక అందిన తర్వాతే ఉక్రెయిన్ చర్యకు ప్రతిచర్యగా కీవ్ పై రష్యా  బాంబులు, క్షిపణులతో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఈ వంతెన ద్వారానే రష్యా నుంచి క్రిమియాకు ఆయుధాలు, మందుగుండు, యుద్ధ పరికరాలు, దళాలను తరలిస్తుంటారు. ఉక్రెయిన్ పై రష్యా సైన్యం దండయాత్రకు వెళ్లేందుకు కూడా ఈ మార్గమే కీలకంగా ఉపయోగపడింది.