డర్టీ బాంబు భయాలు.. రష్యా ‘అణు క్షిపణి’ పరీక్షలు!

డర్టీ బాంబు భయాలు.. రష్యా ‘అణు క్షిపణి’ పరీక్షలు!

ఉక్రెయిన్  విధ్వంసక ‘డర్టీ బాంబు’ను తయారుచేస్తోందని ఆరోపిస్తున్న రష్యా.. తాజాగా ఇవాళ మరోసారి అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన క్షిపణులను పరీక్షించింది. రష్యా న్యూక్లియర్ డ్రిల్స్ లో భాగంగా కాంచట్కా ప్రాంతం, ఆర్కిటిక్ పరిధిలోని బారెంట్స్ సముద్రం సహా పలు ప్రాంతాల్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ ను మోసుకెళ్లే సత్తా కలిగిన ఖండాంతర (బాలిస్టిక్), క్రూయిజ్ క్షిపణులను  టెస్ట్ చేసింది. ఈ క్షిపణి పరీక్షలను స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తన కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించడం గమనార్హం.  దీనిపై  రష్యా ప్రభుత్వం కూడా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘సినేవా’ అనే బాలిస్టిక్ క్షిపణిని ఆర్కిటిక్ పరిధిలోని బారెంట్స్ సముద్రం నుంచి పరీక్షించేందుకు జలాంతర్గామిలో సిబ్బంది సన్నాహాలు చేస్తున్న ఓ వీడియోను రష్యా అధికారిక మీడియాలో ప్రసారం చేశారు. టీయూ 95 స్ట్రాటజిక్ బాంబర్ విమానాల ద్వారా గగనతలం నుంచి లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్ క్షిపణులను రష్యా పరీక్షించినట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యూక్లియర్ తరహా దాడి జరిగినా.. తిప్పికొట్టేందుకే ఈక్షిపణి పరీక్షలు జరిపామని  రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు  వెల్లడించారు. 

ఇండియా, చైనాలకు రష్యా రక్షణ మంత్రి ఫోన్

ఇక అంతకుముందు రోజు (మంగళవారం) ఉక్రెయిన్ డర్టీ బాంబుపై రష్యా రక్షణ మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా ఆక్రమిత ‘ఖేర్‌సన్‌’ ప్రాంతంలోడర్టీ బాంబును ప్రయోగించాలని  ఉక్రెయిన్‌ సైన్యం ప్లాన్ చేసిందని ఆరోపించారు. ఈవిషయంపై ఆయన భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్,  చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ లకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. తమ దేశాన్ని రెచ్చగొట్టేందుకే డర్టీ బాంబును ఉక్రెయిన్ సిద్ధం చేస్తోందని రాజ్ నాథ్ తో సెర్గీ షోయిగు చెప్పారు. ఈ వ్యవహారంపై ఐక్యరాజ్య సమితిలో రష్యా రాయబారి వస్సెయిలీ నెబెంజియా.. ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌కు ఇప్పటికే లేఖ రాశారు. ఉక్రెయిన్ బలగాలు రష్యాపై డర్టీ బాంబు ప్రయోగానికి సిద్ధమయ్యాయని, డర్టీ బాంబు ప్రయోగం అనేది అణు ఉగ్రవాదం కిందకు వస్తుందని, బలప్రయోగాన్ని నిలువరించాల్సిన బాధ్యత ఐరాస మీద ఉందని కోరారు. 

డర్టీ బాంబు అంటే..

సంప్రదాయ పేలుడు పదార్థాలతో పాటు యురేనియం వంటి అణుధార్మిక పదార్థాలు కూడా డర్టీ బాంబులో ఉంటాయి. అది పేలినప్పుడు వాటిలో ఉన్న అణుధార్మిక పదార్థం గాలిలోకి వ్యాపిస్తుంది.  దీని తయారీ కోసం అత్యంత శుద్ధి చేసిన అణుధార్మిక పదార్థం అవసరం లేదు. ఆస్పత్రులు, అణు విద్యుత్ ప్లాంట్లు, పరిశోధన లేబరేటరీల్లో ఉండే అణుధార్మిక పదార్థాలను కూడా ఈ బాంబు తయారీకి వాడొచ్చు. ఈ డర్టీ బాంబులను వాహనాల్లో సైతం ఒకచోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్లొచ్చు.