ఉక్రెయిన్​పై విరుచుకుపడుతున్న రష్యా

ఉక్రెయిన్​పై విరుచుకుపడుతున్న రష్యా
  • వెస్ట్​లోని లష్క్​, దినిప్రో, ఇవానో ఫ్రాంకివిస్క్​పైనా దాడులు ​
  • ఎయిర్​పోర్టులు, ఆర్మీ ఎయిర్​ఫీల్డ్​లే లక్ష్యం
  • దినిప్రోలో స్కూలు, అపార్ట్​మెంట్​, షూ ఫ్యాక్టరీపై మిసైళ్లు
  • లష్క్​లో యుద్ధ విమానాల రిపేర్​ ఫ్యాక్టరీ ధ్వంసం
  • ఎయిర్​పోర్టులు, ఆర్మీ ఎయిర్​ఫీల్డ్​లే లక్ష్యం
  • డస్ట్రియల్​ సిటీ దినిప్రోలో స్కూలు, అపార్ట్​మెంట్​, 
  •  షూ ఫ్యాక్టరీపై మిసైళ్లు 
  •  లష్క్​లో యుద్ధ విమానాల రిపేర్​ ఫ్యాక్టరీ ధ్వంసం


రెండు వారాలుగా యుద్ధం సాగుతూనే ఉన్నది. రష్యా దాడులు ఎంత తీవ్రం చేస్తే.. ఉక్రెయిన్ ప్రతిఘటన అంత ఎక్కువగా ఉంటున్నది. దీంతో మరింతగా విధ్వంసానికి దిగుతున్నది రష్యా. నిన్నమొన్నటి దాకా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం, రాజధాని కీవ్, రెండో పెద్ద సిటీ ఖార్కివ్‌‌ లాంటి ప్రధాన సిటీలపైనే దృష్టి పెట్టిన పుతిన్ ఆర్మీ.. ఇప్పుడు పశ్చిమ ప్రాంతంపైనా గురి పెట్టింది. అక్కడి మూడు ప్రధాన నగరాలపై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఎయిర్​పోర్టులే టార్గెట్‌‌గా బాంబింగ్స్ చేస్తోంది. ఉక్రెయిన్ మిలటరీ ఇన్‌‌ఫ్రా బాగా దెబ్బతిన్నదని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్‌‌లో సురక్షితమైన ప్రాంతమంటూ ఏదీ లేకుండా పోయింది. రష్యా దాడుల్లో ఒక్క మరియుపోల్ లోనే ఇప్పటిదాకా  1,582 మందికి పైగా చనిపోయినట్లు ఆ సిటీ కౌన్సిల్ చెప్పింది.   తాను కూడా ఇద్దరు పిల్లల తండ్రినని, తామెలాంటి జీవాయుధాలను తయారు చేయట్లేదని జెలెన్​స్కీ స్పష్టం చేశారు. మరోవైపు సూమీ సిటీలో చిక్కుకుపోయిన 674 మంది స్టూడెంట్లు పలు విమానాల్లో శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు.

కీవ్: ఉక్రెయిన్​పై రష్యా దాడులను మరింత తీవ్రం చేసింది. ఇప్పటిదాకా ఉక్రెయిన్​ తూర్పు ప్రాంతం, రాజధాని కీవ్​, దేశంలోని రెండో పెద్ద సిటీ ఖార్కివ్​తో పాటు ప్రధాన నగరాలపైనే దాడులతో విరుచుకుపడిన రష్యా.. ఇప్పుడు సేఫ్​ అనుకున్న పశ్చిమ ప్రాంతంపైనా గురి పెట్టింది. ఉక్రెయిన్​ నలుదిక్కులా దాడులను ముమ్మరం చేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వెస్ట్​ ఉక్రెయిన్​లోని మూడు ప్రధాన నగరాలపై రష్యా మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఎయిర్​పోర్టులే టార్గెట్​గా దాడులను చేసింది. పోలెండ్​ బార్డర్​కు 112 కిలోమీటర్ల దూరంలోని లష్క్​ సిటీ ఎయిర్​పోర్టుపై దాడి చేసింది. దీంతో ఆ ఎయిర్​పోర్టు భారీగా ధ్వంసమైనట్టు అధికారులు చెప్పారు. సిటీపై రష్యా సైన్యం 4 మిసైళ్లను ప్రయోగించిందని, దాడిలో ఇద్దరు చనిపోయారని వోలిన్​ గవర్నర్​ ఆరోపించారు. ఎయిర్​ఫీల్డ్​తో పాటు యుద్ధ విమానాల ఇంజన్లను రిపేర్​ చేసే ఏకైక ఫ్యాక్టరీపైనా రష్యా దాడులు చేసింది. వెస్టర్న్​ ఉక్రెయిన్​లోని ఇవానో ఫ్రాంకివిస్క్​లో ఉన్న మిలటరీ ఎయిర్​ఫీల్డ్​పైనా రష్యా మిసైల్​ దాడి చేసింది. సుదూర ప్రాంతాల లక్ష్యాలను ఛేదించే ఆయుధాలతో దాడులు చేశామని, ఉక్రెయిన్​ మిలటరీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ బాగా దెబ్బతిన్నదని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.  

ఇండస్ట్రియల్​ సిటీ దినిప్రోపైనా..
ఇండస్ట్రియల్​సిటీగా పేరున్న దినిప్రోపైనా రష్యా దళాలు దాడులతో విరుచుకుపడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే నగరంపై రష్యా సైనికులు ఎయిర్​స్ట్రైక్స్​ ప్రారంభించినట్టు స్థానికులు చెప్పారు. రష్యా దాడుల్లో చిన్న షూ ఫ్యాక్టరీ, కిండర్​గార్టెన్​ స్కూల్​, అపార్ట్​మెంట్​పై మిసైళ్లు పడ్డాయన్నారు. దాడిలో ఓ వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తోంది. సిటీలో ఓ రాకెట్​ ఫ్యాక్టరీ సహా పెద్దపెద్ద ఇండస్ట్రీలున్నాయి. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం మొదలుపెట్టగానే సిటీ చుట్టూ ఉక్రెయిన్​ దళాలను భారీగా మోహరించారు. వంతెనలు, మెయిన్​ రోడ్లమీద బందోబస్తు పెంచారు. కొన్ని రోజులుగా వేరే దేశాలకు వలసెళ్లిపోయిన ప్రజలు.. దినిప్రో సిటీ మీదుగానే బార్డర్​ దాటారు. తరలింపులకు సిటీ ఇన్నాళ్లూ సేఫ్​గా ఉండడంతో అక్కడి నుంచే తరలింపులను ఎక్కువగా చేశారు. ఇప్పుడు ఆ సిటీపైనా రష్యా దాడులకు పాల్పడింది. దేశంలో సురక్షితమైన సిటీ అంటూ ఏదీ లేదని, రష్యా తన దాడులను విస్తృతం చేస్తోందని ఉక్రెయిన్​ ఎంపీ ఇన్నా సోవ్సన్​ ఆవేదన వ్యక్తం చేశారు. చెర్నిహివ్​పై చేసిన దాడులతో సిటీకి నీటి సరఫరా నిలిచిపోయింది. సిటీకి నీటిని సరఫరా చేసే నెట్​వర్క్​​ధ్వంసమైందని, దానిని బాగు చేస్తున్నామని చెర్నిహివ్​వోడోకెనాల్​ తెలిపింది. మరోవైపు మరియపోల్​తో పాటు వోల్నోవఖా సిటీనీ అధీనంలోకి తెచ్చుకున్నామని రష్యా ప్రకటించింది. రాజధాని కీవ్​ను ఆక్రమించుకునేందుకు వీలుగా సిటీకి చుట్టుపక్కల మరిన్ని దళాలను రష్యా మోహరిస్తున్నట్టు శాటిలైట్​ చిత్రాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఇటీవల దాడులకు గురైన న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్లను పరిశీలిస్తామని, అందుకు టీమ్​ను ఉక్రెయిన్​కు పంపుతామని ఇంటర్నేషనల్​ ఆటమిక్​ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ప్రకటించింది. అయితే, ఎప్పుడు వచ్చేది మాత్రం చెప్పలేదు.  

పాథోజెన్ల​ను నాశనం చేయండి: డబ్ల్యూహెచ్​వో
రష్యా దాడుల నేపథ్యంలో పరిశోధనల కోసం ల్యాబ్​లలో దాచిన ప్రమాదకర పాథోజెన్లను నాశనం చేయాల్సిందిగా ఉక్రెయిన్​కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) సూచించింది. దాడులు జరిగి ఆ సూక్ష్మ జీవులు వాతావరణంలోకి విడుదల కాకముందే ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కోరింది. అమెరికా, వెస్టర్న్​ దేశాల సాయంతో ఉక్రెయిన్​ జీవాయుధాలను తయారు చేస్తోందని రష్యా ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. 

తిండి ధరలు పెరిగే ప్రమాదం: యూఎన్​
రష్యా, ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా తిండి గింజల ధరలు 8 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఫుడ్​ అండ్​ అగ్రికల్చర్​ ఆర్గనైజేషన్​ (ఎఫ్​ఏవో) ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం వల్ల ఉక్రెయిన్​లో పంటల సాగు సంక్షోభంలో పడిందని తెలిపింది. ఇటు రష్యా నుంచి ఆహార ధాన్యాల ఎగుమతి కూడా జరిగే పరిస్థితి లేదని పేర్కొంది. జొన్నలు, తృణ ధాన్యాలు, పొద్దుతిరుగుడు పంటలు సాగయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలిపింది. ప్రపంచానికి గోధుమలను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం రష్యా అని, ప్రపంచ అవసరాల్లో 14 శాతం గోధుమలు అక్కడ్నుంచే వస్తున్నాయని తెలిపింది. తద్వారా చాలా పేద దేశాలకు సరైన పోషకాహారం దొరికే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పోషకాహారలోపంతో బాధపడే వారి సంఖ్య 80 లక్షల నుంచి 1.2 కోట్లు పెరిగే ప్రమాదముందని వెల్లడించింది.

నేనూ ఇద్దరు పిల్లల తండ్రినే.. ఏ జీవాయుధాన్ని తయారు చేయలేదు: జెలెన్​స్కీ
ఉక్రెయిన్​ జీవాయుధాల్ని తయారు చేస్తోందన్న రష్యా ఆరోపణలను ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలోదిమిర్​ జెలెన్​స్కీ ఖండించారు. తామెలాంటి జీవాయుధాలను తయారు చేయట్లేదని చెప్పారు. ‘‘జనాల్ని అంతం చేసే ఎలాంటి రసాయన ఆయుధాలు, జీవాయుధాలను మేం తయారు చేయట్లేదు. నేను ఓ మోతాదు దేశానికి అధ్యక్షుడినే. ఇద్దరు పిల్లల తండ్రిని. జనాల్ని చంపే ప్రమాదకర ఆయుధాలను మా దేశంలో తయారు చేసే అవసరం మాకు లేదు’’ అని తేల్చి చెప్పారు. రష్యా సహా ప్రపంచం మొత్తానికి ఆ విషయం తెలుసని అన్నారు. అలాంటి ఆయుధాలను తమపైనే రష్యా ప్రయోగించాలన్న ప్లాన్​లో ఉందేమోనని, అదే నిజమైతే రష్యా ఇంకా భయంకరమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘‘మేము​ రసాయన ఆయుధాలతో దాడులు చేస్తామని రష్యా చెప్పడం వెనుక అర్థమేంటి? అంటే ఉక్రెయిన్​ను డీ కెమికలైజ్​ చేయాలని చూస్తున్నారా? ఫాస్పరస్​, అమోనియాతో మాపై దాడులు చేయాలనుకుంటున్నారా? మాపై ఎట్లాంటి దాడులు చేయబోతున్నరు?’’ అని రష్యాపై జెలెన్​స్కీ మండిపడ్డారు.