మాతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటది: పుతిన్​

మాతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటది: పుతిన్​
  • పది నగరాల్లో భయానక వాతావరణం
  • ఒక్క కీవ్ లోనే 75 మిసైళ్ల ప్రయోగం
  • 8 మంది మృతి, 24 మందికి గాయాలు

ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. సోమవారం కీవ్ సహా పది నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఒక్క కీవ్ పైనే 75 మిసైళ్లు ప్రయోగించింది. బిల్డింగులు, అపార్ట్ మెంట్లు ధ్వంసమయ్యాయి. దీంతో  8 మంది చనిపోగా, 24 మంది గాయపడ్డారు. కొన్ని ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో కలిపేందుకు ఆ దేశ ఆర్మీ ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ సోల్జర్ల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నది.

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది. క్రిమియాను రష్యాతో కలిపే కెర్చ్ బ్రిడ్జిపై బాంబు దాడితో ప్రతీకారంగా భీకర దాడులు చేసింది. సోమవారం తెల్లవారుజామునే కీవ్ సహా పది నగరాల్లో రష్యా ఆర్మీ భయానక దాడులు చేసింది. ఒక్క కీవ్ పైనే 75 మిసైళ్లు ప్రయోగించింది. దీంతో కీవ్ నగరమంతా భీతావహ వాతావరణం నెలకొంది. మిసైల్స్ దాడిలో బిల్డింగులు, అపార్ట్ మెంట్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎనిమిది మంది చనిపోయారు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఎక్కడ చూసినా గాయాలతో బాధితులు కనిపించారు. కొన్ని ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో కలిపేందుకు ఆ దేశ ఆర్మీ ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో ఉక్రెయిన్ సోల్జర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. దీంతో రష్యా సైనికులు రెచ్చిపోయి దాడులు చేశారు. రాజధాని కీవ్ సిటీలో చారిత్రక ప్రదేశాలతో పాటు గవర్నమెంట్ ఆఫీసులు, పార్లమెంట్, ఇతర కీలక ప్రాంతాలపై మిసైళ్ల వర్షం కురిసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. స్థానికులు రోడ్లపై రక్తగాయాలతో కనిపించారని చెప్పారు. ఓ మహిళ తన తల చుట్టూ బ్యాండేజీ కట్టుతో కనిపించిందని, ఆమె ఒళ్లంతా రక్తంతో తడిసిందని వెల్లడించారు. దాడుల్లో పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయని, సెంట్రల్ కీవ్​లోని కీవ్ నేషనల్ యూనివర్సిటీ సమీపంలోనూ దాడి జరిగిందని తెలిపారు.

అనవసర ప్రయాణాలొద్దు ఉక్రెయిన్​లోని మనోళ్లకు సూచన
ఉక్రెయిన్​ రాజధాని కీవ్​తో పాటు పలు నగరాలపై రష్యా దాడులు చేస్తున్నదని, ఈ టైంలో అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోవద్దని కీవ్​లోని ఇండియన్​ ఎంబసీ అధికారులు సూచించారు. లోకల్​ ఆఫీసర్లు జారీ చేసిన సేఫ్టీ, సెక్యురిటీ రూల్స్​ను ప్రతి ఒక్కరు పాటించాలని ఆదేశించారు. ఉక్రెయిన్​లోని ఇండియన్స్, తమ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎంబసీకి చేరవేయాలన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు వారి వద్దకు వెళ్లేందుకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.

సైరన్​తో హెచ్చరిక..
కెర్చ్ బ్రిడ్జిపై బాంబు దాడి తర్వాత కీవ్ సహా పలు నగరాల్లో రష్యా ప్రతీకార దాడులు నిర్వహించవచ్చని ఉక్రెయిన్ అధికారులు ముందు నుంచే సైరన్ లు మోగించి పౌరులను హెచ్చరించారు. కానీ అధికారుల హెచ్చరికలను పౌరులు పట్టించుకోలేదు. ఎప్పట్లాగే తమ దైనందిన జీవితం ప్రారంభించారు. ఈలోపు రష్యా ఆర్మీ ఊహించని విధంగా దాడులు జరిపింది. కీవ్​పై మిసైళ్ల వర్షం కురిపించింది. ఏకంగా 75 మిసైళ్లు ప్రయోగించి నగరవాసులను తీవ్రంగా భయపెట్టింది. దీంతో పౌరులు ప్రాణరక్షణ కోసం బాంబ్ షెల్టర్లలో తలదాచుకున్నారు. అధికారులు సిటీలోని సబ్ వే సిస్టమ్​ను బాంబు షెల్టర్ గా మార్చారు. దీంతో పౌరులు సబ్​వేలో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక నిప్రో, లవీవ్, ఖార్కివ్, టెర్నోపిల్, ఖ్మెల్ నిట్స్ కీ, జైతోమర్, క్రోపీవింట్స్ కీ నగరాల్లోనూ నాలుగు గంటల పాటు ఆగకుండా రష్యా దాడులు జరిపింది. నిప్రో సిటీ సరిహద్దుల్లో పలు డెడ్ బాడీలు దొరికాయని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఖార్కివ్ పై మూడుసార్లు దాడులు జరిగాయని, విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. లవీవ్​లో ఎనర్జీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కూడా ధ్వంసమైందని చెప్పారు.