ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా

ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా
  •     కీవ్, ఖార్కివ్‌‌తోపాటు మికోలైవ్, మోస్చన్ సిటీల్లో మిసైళ్ల వర్షం
  •     మరియుపోల్ సిటీలో మసీదుపై షెల్లింగ్
  •     వాసిల్కివ్ టౌన్‌‌లో ఎయిర్‌‌‌‌బేస్‌‌పై రాకెట్ దాడులు
  •     మందుగుండు సామగ్రి ఉన్న డిపోపైనా అటాక్స్
  •     మెలిటోపోల్ మేయర్‌‌ కిడ్నాప్.. కొత్త రకం తీవ్రవాదమంటూ రష్యాపై ఫైర్

కీవ్: ఉక్రెయిన్‌‌పై రష్యా దండయాత్ర మూడో వారానికి చేరుకుంది. మొన్నటిదాకా కీలకమైన కీవ్, ఖార్కివ్, మరియుపోల్ తదితర సిటీలపైనే మిసైళ్ల వర్షం కురిపించిన రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్ నలువైపులా సమాంతరంగా దాడులు చేస్తోంది. రాజధాని సరిహద్దుల నుంచి మెల్లమెల్లగా సిటీలోకి చొచ్చుకొస్తోంది. రోజూ బలగాల సంఖ్యను పెంచుతోంది. మిలటరీ బేస్‌‌లు, ఎయిర్‌‌‌‌పోర్టులు, ఇండ్లు, గోదాములు, ఆస్పత్రులు, స్కూళ్లు, మసీదులు.. ఇలా దేన్నీ వదలకుండా ధ్వంసం చేసుకుంటూ ముందుకు పోతోంది. దీంతో నగరాలు శిథిలాలు అవుతున్నాయి. లక్షల మంది వలస పోతున్నారు. వేల మంది గాయపడుతున్నారు. వందల మంది చనిపోతున్నారు. ఉక్రెయిన్ నిలువెల్లా గాయాలైనా.. అధ్యక్షుడు జెలెన్‌‌స్కీ మాత్రం ధీమాగానే ఉన్నారు. గెలుపుకు దగ్గర్లో ఉన్నామంటూ తమ సైన్యానికి ధైర్యం నూరిపోస్తున్నారు.  

86 మంది ఉన్న మసీదుపై దాడి.. 

ఉక్రెయిన్‌‌ రాజధాని కీవ్‌‌ దాకా రష్యన్ బలగాలు చేరుకున్నాయి. కీవ్ లో ఎయిర్ రెయిడ్ సైరన్లు మారుమోగాయి. కీవ్ చుట్టుపక్కల తీవ్ర పోరాటం కొనసాగుతోంది. ఖార్కివ్‌‌ను మొత్తం చుట్టుముట్టగా, మికోలైవ్ సిటీపై దాడులను తీవ్రం చేసింది. కీవ్‌‌కు 33 కిలోమీటర్ల దూరంలోని మోస్‌‌చన్ టౌన్‌‌లో భారీగా గన్నులతో కాల్పులు జరిపారు. ఈ పట్టణంలోని ఇండ్లన్నీ మంటల్లో చిక్కుకున్నాయి. మరియుపోల్ సిటీలో పౌరులు తలదాచుకుంటున్న మసీదుపై రష్యా షెల్లింగ్ చేసినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ చెప్పింది. ఆ మసీదులో 34 మంది చిన్నారులు సహా 86 మంది టర్కీ పౌరులు ఉన్నట్లు టర్కీలోని ఉక్రెయిన్ ఎంబసీ వెల్లడించింది. అయితే ఎంతమంది చనిపోయారనేది తెలియరాలేదు. మరోవైపు కీవ్ రీజియన్‌‌లోని వాసిల్కివ్ టౌన్‌‌లో ఎయిర్‌‌‌‌బేస్‌‌పై రష్యా రాకెట్ దాడులు జరిపింది. మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్! సౌత్ ఉక్రెయిన్‌‌లోని మెలిటోపోల్‌‌లోకి చొచ్చుకెళ్లిన రష్యన్ దళాలు.. సిటీ మేయర్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నాయి. ‘‘మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడొరోవ్‌‌ను 10 మందితో కూడిన ఆక్రమణదారుల టీమ్ కిడ్నాప్ చేసింది” అని ఉక్రెయిన్ పార్లమెంట్ ట్వీట్ చేసింది. తమ మేయర్‌‌‌‌ను రిలీజ్ చేయాలని లోకల్ ప్రజలు డిమాండ్ చేశారు.  

మరో జనరల్‌‌ను చంపినం: ఉక్రెయిన్

మరో రష్యా జనరల్‌‌ను చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. మరియుపోల్‌‌లో రష్యన్ మేజర్ జనరల్ ఆండ్రీ కోలెస్నికోవ్ చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అయితే కోలెస్నికోవ్ డెత్‌‌పై రష్యా ఇంకా స్పందించలేదు.  ఇప్పటిదాకా ముగ్గురు రష్యా జనరల్స్‌‌ను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆఫీసర్లు చెబుతున్నారు.

యుద్ధం వల్ల 25 లక్షల మంది వలస: యూఎన్

ఉక్రెయిన్‌‌లో జరుగుతున్న అర్థం లేని యుద్ధం వల్ల 25 లక్షల మందికి పైగా ప్రజలు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇప్పటిదాకా 564 మంది పౌరులు చనిపోయారని, అందులో 41 మంది పిల్లలు ఉన్నారని పేర్కొంది. 

రష్యా తల్లులారా.. మీ పిల్లల్ని పంపకండి: జెలెన్‌‌స్కీ

‘‘ఉక్రెయిన్ ఇప్పటికే వ్యూహాత్మక టర్నింగ్‌‌ పాయింట్‌‌కు చేరుకుంది. ఉక్రెయిన్ భూమిని చొరబాటుదారుల నుంచి విడిపించేందుకు మనకు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పడం కష్టం. కానీ మనం ఆ పని చేస్తామని మాత్రం చెప్పగలను. మనం ఇప్పటికే లక్ష్యం, విజయం వైపు వెళ్తున్నం” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌‌లో యుద్ధం చేసేందుకు తమ పిల్లల్ని పంపొద్దని రష్యన్ తల్లులను జెలెన్‌‌స్కీ కోరారు. ‘‘ముఖ్యంగా నిర్బంధంగా సైన్యంలో చేరిన పిల్లల తల్లులకు మరోసారి చెప్పాలని అనుకుంటున్నా.. విదేశంలో యుద్ధం చేసేందుకు మీ పిల్లల్ని పంపొద్దు. మీ కొడుకులు ఎక్కడ ఉన్నారో వెంటనే తెలుసుకోండి. రష్యన్ ఆర్మీ అధికారులు మీ పిల్లల గురించి చెప్పే మాయమాటలను మీరు నమ్మవద్దు. మీ కొడుకులను యుద్ధానికి పంపుతారని చిన్న అనుమానం వచ్చినా వెంటనే అలర్ట్ అవ్వండి. వాళ్లను మేం పట్టుకోకుండా లేదా చంపకుండా ముందే జాగ్రత్త పడండి” అని సూచించారు. 

రష్యా బార్డర్లలో 12 వేల ట్రూప్స్: బైడెన్

రష్యా బార్డర్లలోని లాట్వియా, ఎస్టోనియా, లిథువేనియా, రొమేనియా దేశాల్లో 12 వేల ట్రూప్స్‌‌ను మోహరించినట్లు యూఎస్​ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. యుద్ధంలో పుతిన్ గెలవబోరన్నారు. తాము యుద్ధానికి దిగబోమని, దిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ఆయన అన్నారు. హౌస్ డెమోక్రటిక్ కాకస్ సభ్యులను ఉద్దేశించి శుక్రవారం  బైడెన్ మాట్లాడారు. నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని తాము పూర్తిగా రక్షించుకుంటామని స్పష్టం చేశారు.