ఫిన్లాండ్, స్వీడన్ దేశాలకూ రష్యా వార్నింగ్

ఫిన్లాండ్, స్వీడన్ దేశాలకూ రష్యా వార్నింగ్
  • ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి 50 రోజులు 
  • అణ్వాయుధాలను బోర్డర్ లో మోహరిస్తామని బెదిరింపు 
  • తూర్పు ప్రాంతం స్వాధీనానికి రష్యా స్కెచ్ 

కీవ్/మాస్కో: ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరొద్దంటూ దండెత్తిన రష్యా.. తాజాగా తన బార్డర్ లో ఉన్న మరో రెండు దేశాలకూ ఇదే వార్నింగ్ ఇచ్చింది. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు కూడా నాటోలో చేరాలన్న ఆలోచనను మానుకోవాలని, లేదంటే బార్డర్ లో అణ్వాయుధాలను మోహరిస్తామని గురువారం రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వదేవ్ హెచ్చరించారు.

ఉక్రెయిన్ పై యుద్ధంతో దూకుడు మీదున్న రష్యాకు చెక్ పెట్టడం కోసం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)లో చేరేందుకు ఫిన్లాండ్, స్వీడన్​ సిద్ధమవుతున్నాయి. నాటోలో తాము చేరుతామని ఇప్పటికే ఫిన్లాండ్​ ప్రధాని సనా మారిన్​ ప్రకటించారు. దీంతో ఆ రెండు దేశాలకు మెద్వదేవ్ వార్నింగ్ ఇచ్చారు. నాటోలో చేరితే బాల్టిక్ సముద్రంలో, చుట్టుపక్కల ఇస్కందర్ మిసైల్స్, హైపర్ సోనిక్ మిసైల్స్, అణ్వాయుధాలతో కూడిన నౌకలను మోహరిస్తామని టెలిగ్రాం పోస్టులో హెచ్చరించారు. 
యుద్ధానికి 50 రోజులు 
ఉక్రెయిన్​పై రష్యా దండయాత్రకు గురువారం నాటికి 50 రోజులు అయ్యాయి. జనాల బతుకుల్లో కల్లోలం సృష్టిస్తూ ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధం ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఇన్నాళ్లూ ఉక్రెయిన్ నార్త్, రాజధాని కీవ్​పైనే​పట్టు కోసం దాడులు చేసిన రష్యా.. ఇప్పుడు తూర్పుపై గురిపెట్టింది. యుద్ధ వ్యూహాన్ని మార్చి డాన్బాస్​పై పట్టు సాధించేందుకు చకచకా కదులుతోంది.

మే తొలి వారం నాటికి తూర్పు ఉక్రెయిన్​లోని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. రష్యా నైరుతి దిక్కున సరిహద్దులకు తూర్పు ఉక్రెయిన్​ ప్రాంతం అతి దగ్గరగా ఉండడం వల్ల అక్కడి నుంచి సైనికులు, ఆయుధాలను పంపేందుకు అనుకూలంగా ఉంటుందని, కమ్యూనికేషన్ గ్యాప్​ కూడా రాదని రష్యా ఆలోచిస్తోంది. తూర్పు ఉక్రెయిన్​ను చేజిక్కించుకుంటే ఉక్రెయిన్​ మొత్తాన్ని ఈజీగా స్వాధీనం చేసుకోవచ్చన్న దురాలోచననూ రష్యా చేస్తున్నట్టు తెలుస్తోంది. 
ఖార్కివ్, మరియుపోల్​పై దాడులు
ఉక్రెయిన్​ రెండో పెద్ద సిటీ అయిన ఖార్కివ్​పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం చేసిన దాడుల్లో నలుగురు చనిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు రష్యా బలగాలు ఖార్కివ్​లోకి వస్తుండడంతో బ్రిడ్జిని పేల్చేశామని ఉక్రెయిన్​ ఆర్మీ తెలిపింది. రష్యా సేనలు ఇజియం వైపు వెళ్తున్నాయని, వారిని అడ్డుకునేందుకు స్పెషల్​ ఆపరేషన్స్​ ఫోర్సెస్​ కమాండ్​ సైనికులు రంగంలోకి దిగారని చెప్పింది. మరోవైపు ప్రజలను రక్షించేందుకు తాజాగా మరో 9 రూట్లను ప్రకటించారు. ఇటు మరియుపోల్​ సిటీని మొత్తం రష్యా సైన్యం చుట్టుముట్టింది. ఆ సిటీలోని 1.8 లక్షల మందికిపైగా ప్రజలను బయటకు తరలించడం కష్ట సాధ్యమవుతోందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్​కు చెందిన 1,026 మంది మెరైనర్లు లొంగిపోయారని రష్యా ప్రకటించింది. అందులో 47 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారంది. మరోవైపు ఈ 50 రోజుల యుద్ధంలో 197 మంది చిన్నారులు చనిపోగా.. 351 మంది గాయపడ్డారు. కాగా, 5 లక్షల మంది ఉక్రెయిన్​ ప్రజలను రష్యా బలవంతంగా వారి దేశంలోకి తీసుకెళ్లిపోయిందని ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలోదిమిర్​ జెలెన్​స్కీ ఆరోపించారు. ఎస్టోనియా పార్లమెంట్​నుద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రజల నుంచి ఫోన్లు, పాస్​పోర్టులను రష్యా లాగేసుకుందని మండిపడ్డారు. రష్యా ప్రజలు ఉక్రెయిన్​కు చెందిన పిల్లలను అక్రమంగా దత్తత తీసుకునేలా రష్యా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. 
5 లక్షల మందిని తీసుకెళ్లిన్రు: జెలెన్ స్కీ 
ఉక్రెయిన్ లో మారణహోమానికి పాల్పడుతున్న రష్యా 5 లక్షల మంది ప్రజలను రష్యాలోని మారుమూల ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆరోపించారు. బుధవారం ఎస్తోనియా పార్లమెంట్ ను ఉద్దేశించి ఆయన వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. రష్యాకు తరలించిన తమ ప్రజల నుంచి డాక్యుమెంట్లు, ఫోన్ లు లాక్కున్నారని, ఉక్రెయిన్ పిల్లలను రష్యన్ కుటుంబాలకు అక్రమంగా దత్తత ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉక్రెయిన్ ల తరలింపును రష్యా ఆపేలా, ఇప్పటివరకు తీసుకెళ్లిన వాళ్లను వెనక్కి తెచ్చేందుకు యూరోపియన్ యూనియన్ సహాయం చేయాలని కోరారు. 
ఉక్రెయిన్​కు అమెరికా భారీ ఆయుధాలు
యుద్ధంలో ఉక్రెయిన్​కు సాయం కోసం అమెరికా భారీగా ఆయుధాలను అందిస్తోంది. తాజాగా 11 ఎంఐ 17 హెలికాప్టర్లు, 300 డ్రోన్లు, 18 హొవిట్జర్లు, 200 ఎం113 సిబ్బంది ట్రాన్స్​పోర్టేషన్​ వెహికల్స్​, 10 కౌంటర్​ ఆర్టిలరీ రాడార్లు, 500 జావెలిన్​ యాంటీ ట్యాంక్​ మిసైళ్లు, శత్రువుల తూటాల నుంచి రక్షించుకునేందుకు వీలుగా 30 వేల సెట్ల బాడీ సూట్లు, హెల్మెట్లను అందించనుంది. ఈ విషయాన్ని పెంటగాన్​ ప్రెస్​ సెక్రటరీ జాన్​ కిర్బీ ప్రకటించారు. వాటి విలువ 80 కోట్ల డాలర్లు (సుమారు రూ.6,097 కోట్లు) ఉంటుందని చెప్పారు. ఇటు యూరోపియన్​ యూనియన్​ కూడా ఉక్రెయిన్​ ఆర్మీకి 50 కోట్ల యూరోలను (సుమారు రూ.4,125 కోట్లు) సాయంగా అందజేస్తామని ప్రకటించింది. 
రష్యా షిప్​ను పేల్చేసిన ఉక్రెయిన్​
రష్యాకు అత్యంత కీలకమైన మాస్క్వా అనే యుద్ధ నౌకను నల్ల సముద్రంలో పేల్చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ‘నెప్ట్యూన్​’ మిసైల్స్​తో షిప్​పై దాడి చేశామని ఒడెసా గవర్నర్​ మ్యాగ్జిమ్​ మార్చెంకో చెప్పారు. ఇదే విషయాన్ని  ఉక్రెయిన్ దక్షిణ ఆపరేషనల్ కమాండ్ కూడా ప్రకటించింది. అయితే, యుద్ధ నౌకలోని బాంబులు పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని, నౌక ఇంకా సముద్రంలో తేలుతూనే ఉందని రష్యా రక్షణ శాఖ చెప్పింది. షిప్​లోని సిబ్బందినంతా సురక్షితంగా తరలించామని వెల్లడించింది. ఆ షిప్​ను పోర్టుకు తరలించేందుకు చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపింది.