
మాస్కో: మూడేళ్లుగా సాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల (ఆగస్ట్) 15న అలస్కాలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో భేటీ అయ్యారు ట్రంప్. యుద్ధం ఆపడానికి సంబంధించిన అంశాలపై ఇరుదేశాధినేతలు దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చలు సానుకూలంగా జరిగినట్లు ఇద్దరూ సంయుక్త ప్రకటన కూడా చేశారు. ఈ భేటీ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడితో సమావేశానికి సిద్ధమయ్యారు ట్రంప్. సోమవారం (ఆగస్ట్ 18) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు.
ట్రంప్, జెలెన్ స్కీ మధ్య కీలక సమావేశం జరుగుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడింది రష్యా. సోమవారం (ఆగస్ట్ 18) ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో రష్యా దాడులు చేసింది. రష్యా దాడుల్లో కనీసం 10 మంది మరణించగా.. దాదాపు 30 మంది గాయపడ్డారు. ఈశాన్య ఖార్కివ్‌లోని నివాస పరిసరాల్లో జరిగిన రష్యా డ్రోన్ దాడిలో ఏడుగురు మరణించారని.. ఇందులో ఒక చిన్నారి, ఆమె 16 ఏళ్ల సోదరుడు సహా మొత్తం కుటుంబం ప్రాణాలు కోల్పోయిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
ఆగ్నేయ నగరమైన జాపోరిజ్జియాపై జరిగిన రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారని, మరో 23 మంది గాయపడ్డారని ఆ ప్రాంతీయ గవర్నర్ ధృవీకరించారు. యుద్ధం ఆపడానికి ఓ వైపు ట్రంప్ శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు పుతిన్ మాత్రం ఉక్రెయిన్ పై దాడులు చేయించడం చర్చనీయాశంగా మారింది. అయితే, ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ రష్యా డిమాండ్లకు వ్యతిరేకంగా మాట్లాడటంతోనే మాస్కో ఈ దాడులకు పాల్పడిందని ప్రచారం జరుగుతోంది. మరీ రష్యా దాడులపై ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.